కర్నూల్ జిల్లా అవుకులో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు

 

కర్నూల్ జిల్లా అవుకులో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చల్లా కుటుంబ వ్యవహారాలు వీధిన పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు చల్లా భగీరథ రెడ్డి మరణం తర్వాత కుటుంబలో తలెత్తిన గొడవలు ముదిరి పాకాన పడటంతో రెండు వర్గాలుగా కుటుంబ చీలిపోయింది. చల్లా రామకృష్ణారెడ్డి కుమారులు, సోదరులకు, చల్లా భగీధర్ రెడ్డి భార్య శ్రీలక్ష్మి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి కాస్త తీవ్రం కావడంతో చల్లా భగీరథ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మీ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలంటూ ️ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. ️ తండ్రి రఘురామరెడ్డితో పాటు ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని సీఎం జగన్‌ను కలిశారు. కర్నూలు కీలక నేతగా ఉన్న చల్లా రామకృష్ణా రెడ్డి 2019 ఎన్నిలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన ఎమ్మెల్సీగా చనిపోవడంతో పదవిని ఆ‍యన కుమారుడికి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వచ్చిన కొన్నాళ్లకే చల్లా భగీరథ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. చల్లా రామకృష్ణారెడ్డి మరణం తర్వాత ఎమ్మెల్సీ పదవిని భగీరథ రెడ్డికి ఇచ్చారు. భగీరథ రెడ్డి మరణం తర్వాత రాజకీయ వారసత్వం ఎవరికి దక్కాలనే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. చల్లా రామకృష్ణారెడ్డి వర్థంతి సందర్భంగా ఇవి తారా స్థాయికి చేరాయి.

భగీరథ రెడ్డి సతీమణికి ఆహ్వానం అందకపోవడంతో అవుకులో ఆమె విడిగా కార్యక్రమాలు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన నివాసం ముందు శ్రీలక్ష్మీ వర్గీయులు బాణాసంచా కాల్చి హంగామా సృష్టించారు. దీంతో చల్లా సోదరులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భగీరథ రెడ్డి రాజకీయ వారసత్వం తనకు దక్కాలని శ్రీలక్ష్మీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో విభేదిస్తున్నారు. తనకు మద్దతుగా సోదరుడు సోమశేఖర్‌ రెడ్డిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినట్లు ప్రచారం జరుగుతోెంది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీలక్ష్మీ నేరుగా తాడేపల్లి చేరుకుని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రితో శ్రీలక్ష్మీ భేటీ తర్వాత ఆమెకు పోలీసు భద్రత కల్పించడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చల్లా కుటుంబంలో నెలకొన్న విభేదాలపై కాటసాని రామిరెడ్డి మధ్యవర్తిత్వం వహించాలని తాడేపల్లి నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. చల్లారామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్‌ రెడ్డిని చల్లా కుటుంబ రాజకీయ వారసుడిగా ప్రకటించాలని కుటుంబం బావిస్తున్న నేపథ్యంలో కాటసాని చర్చలు కీలకంగా మారాయి. చల్లా రామకృష్ణారెడ్డి నలుగురు సోదరులతో పాటు ఇతర కుటుంబ సభ్యులను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో జరుగుతున్న మధ్యవర్తిత్వం ఎంత మేరకు ఫలిస్తుందనే దానిపై నియోజక వర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.