Headlines

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 12. 10 నిమిషాలకు సమావేశాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సమాచారం పంపిందని తెలుస్తోంది. అదే రోజు.. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 2023 – 24 వార్షిక బడ్జెట్ కి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహా అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్థికశాఖ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి… బడ్జెట్ కు తుదిరూపునిస్తోంది. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. బడ్జెట్ రూపకల్పన పూర్తయిన వెంటనే రాష్ట్ర వార్షిక పద్దుకి ఆమోదముద్ర వేసి.. ఫిబ్రవరి 3న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు… మండలిలో మరో మంత్రి 2023 – 24 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని సమాచారం. బడ్జెట్ ఎంత ఉంటుందనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఏడాది కావడంతో… ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువ మొత్తంతో ఆర్థిక పద్దుని ప్రవేశపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2022 -23 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,56,958 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ. లక్ష రుణమాఫీ పూర్తి చేసేందుకు ఈ సారి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. దళిత బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్ల కోసం అధిక మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్ లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే.. అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో.. గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు మొదలు కానున్నాయి. గవర్నర్ తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో… 2021 సెప్టెంబర్ 27న మొదలైన సమావేశాల కొనసాగింపుగానే ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. శాసన, శాసన మండలి ప్రోరోగ్ కాని నేపథ్యంలో.. తాజాగా…. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా.. శాసనసభ సచివాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం పంపించారు. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.