గుంటూరులోని NRI ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు

నిన్నటి వరకు తెలంగాణలో ఈడీ సోదాలు జరగగా… తాజాగా ఈ రైడ్స్ ఏపీకి కూడా చేరాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని NRI ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు. కరోనా సమయంలో జరిగిన అవకతవకలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ఈడీ బృందాలు ఎన్నారై ఆసుపత్రి, వైద్యకళాశాల, డైరెక్టర్ల నివాసాలు, వారికి సంబంధించిన న్యాయవాదుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. పలు లు రికార్డులను, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీసింది ఈడీ. లావాదేవీలకు సంబంధించి రికార్డులు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లు వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు వార్తలు వస్తున్నాయి. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

మంత్రికి నోటీసులు.. మరోవైపు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీశాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసులు నెల రోజుల క్రితమే అందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా పరిధిలోని ఆస్పరి మండలం ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల సమీపంలో మంత్రి దాదాపు 180 ఎకరాల వరకూ తన కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేశారు. 2020 మార్చి 2వ తేదీన ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందులో ఆయన భార్య రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు ఉంది. మొత్తం రూ.52.42 లక్షలకు ఆ భూములు కొనగా ఒక్కో ఎకరా రూ.1.75 లక్షలు పడిందని తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం నగదు ఎక్కడిది, ఎలా చెల్లింపులు చేశారో చెప్పాలని హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసు నుంచి మంత్రి భార్యకు నోటీసులు అందాయి. అంతేకాకుండా సదరు 30.83 ఎకరాలను కూడా అటాచ్‌ చేశారు. ఈడీ నోటీసులపై మంత్రి కూడా స్పందించారు. తాము ఆ భూములు కొన్నట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు. తమది ఉమ్మడి కుటుంబం అని, దాదాపు వారసత్వంగా వంద ఎకరాల భూమి ఉందని చెప్పారు. ‘ఏ అక్రమాలూ చేయలేదు. ఎవరినుంచి లాక్కోలేదు. బినామీ అనేది లేనే లేదు. నా తమ్ముడి భార్య, మరో తమ్ముడి భార్య పేరున పొలం తీసుకున్నాం. అంతే, ఐటీ అధికారుల నోటీసులు అందలేదు. ఒకవేళ మమ్మల్ని వివరణ అడిగితే అన్ని ఆధారాలు చూపిస్తాం.” అని చెప్పారు. ఇటీవల తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలీజీలు, ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైడ్స్ కూడా మెడికల్ కాలేజీలో సీట్ల విషయంలో పెద్ద ఎత్తున డొనేషన్లు తీసుకున్నారనే ఆరోపణలతో సోదాలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆస్పత్రుల్లో ఈ తరహా సోదాలు జరగడం కలకలం రేపుతోంది.