మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌! 

 మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌! 

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరువకాగా వీరిలో ఇప్పటికే 3600మంది మృత్యువాతపడ్డారు. తాజాగా రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్‌ ముండేకు కొవిడ్‌-19 నిర్ధారణ అయ్యింది. ధనంజయ్‌ ముండేకు లక్షణాలు కనిపించనప్పటికీ వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్‌ వెల్లడించారు. ఇప్పటికే ముండే వంట మనిషి, డ్రైవర్లతోపాటు పీఏకు కూడా కరోనా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అయితే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)కి చెందిన ధనంజయ్‌ ముండే గత వారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు. మహారాష్ట్ర కేబినెట్‌ వైరస్‌ సోకిన మూడో వ్యక్తి ధనంజయ్‌ ముండే కావడం గమనార్హం. ఇప్పటికే జితేంద్ర అవ్‌హద్‌(ఎన్‌సీపీ), అశోక్‌ చౌహాన్‌(కాంగ్రెస్‌) మంత్రులకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఇప్పటికే కోలుకున్నారు.

News 9

Related post