కమలంతో కూటమి కోసం బాబు

తెలంగాణ రాజకీయాల్లో పై చేయి కోసం పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. 9 ఏళ్లలో తెలంగాణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాం.. ఇక దేశగతిని మారుస్తామంటూ.. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గులాబీ దళపతి అలా.. ఒక అడుగు బయట పెట్టగానే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం అంటూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి చంద్రబాబు తిరిగి ప్రవేశించారు. తెలంగాణలో టీడీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని ఉద్దేశించి… తమ్ముళ్లూ తిరిగి వచ్చేయండంటూ… ఖమ్మంలో జరిగిన టీడీపీ శంఖారావం సభ వేదికగా… చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రజల నుంచి విశేష స్పందన రావటంతో.. రెట్టించిన ఉత్సాహంతో.. త్వరలోనే పరేడ్ గ్రౌండ్స్ లో సింహ గర్జన పేరుతో మరో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.. టీ టీడీపీ. ఇన్నాళ్లూ పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమైన చంద్రబాబు… అక్కడ మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు చావోరేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు.. తెలంగాణలోనూ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తూ.. సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపారు. మరి… టీడీపీ అధినేత అమలు చేస్తున్న ఈ వ్యూహాలు… తెలంగాణ రాజకీయాల్లోకి ఎవరికి నష్టం చేకూర్చనున్నాయి.. ? ఎవరికి మేలు చేయనున్నాయి.. ? 2018లో ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజా కూటమి తరహాలోనే… 2023లో రాష్ట్రంలో మరో కూటమి రూపుదిద్దుకోనుందా.. ? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కలిసొచ్చే మిత్రులను ఆహ్వానిస్తోంది. అయితే.. కేసీఆర్ సర్కార్ ను గద్దెదించాలంటే.. బీజేపీ ఇంకా బలం పుంజుకోవాలి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. బీజేపీ ఎదుర్కొంటున్న ఆ లోటుని కొంతలో కొంతైనా పూడ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగానే… తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు టీడీపీ అధినేత ఆసక్తి చూపిస్తున్నారని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో కూటమి కట్టి… కేసీఆర్ తో కమలం నేతలు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి.. ఆ మైత్రి బంధాన్ని ఏపీకి విస్తరించాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం అవసరమైతే… తెలంగాణలో… పవన్ కళ్యాణ్ జనసేన, వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. బీజేపీ ఆధ్వర్యంలో .. మహాకూటమి తయారు చేయాలన్నది బాబు వ్యూహంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. తద్వారా తెలంగాణలో పూర్తిగా కనుమరుగైన టీడీపీని మళ్లీ ఉనికిలోకి తేవచ్చని… అలాగే ఇక్కడి పొత్తు ద్వారా ఏపీలోను బీజేపీతో కూటమి కట్టేందుకు మళ్లీ దారులు తెరవచ్చన్నది బాబు వ్యూహంగా కనిపిస్తోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి పనిచేస్తోన్న పవన్.. టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే… ఈ అంశంలో బీజేపీ వైఖరే ఇంకా ఎటూ తేలలేదు. 2014లో కమలం పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. అనంతర పరిణామాలతో ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటి వరకు మిత్రుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం దూరం చేసుకున్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో… 2019లో ఒంటరిగా పోటీలో నిలిచిన చంద్రబాబు.. దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో…. మళ్లీ పునరాలోచనలో పడ్డ సీబీఎన్…. జగన్ ను ఓడించాలంటే పొత్తులే శరణ్యమని నిర్ణయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే… పవన్ కి మళ్లీ దగ్గరయ్యారు. బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం తెలంగాణ రాజకీయాలను అవకాశంగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే.. ఇటీవల తెలంగాణ టీడీపీకి నూతన అధ్యక్షుడిని నియమించారు. భారీ ఎత్తున ఖమ్మంలో సభ నిర్వహించారు. అదే జోరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మరో సభ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణలో టీడీపీ కూడగట్టే శక్తిని .. బీజేపీ గెలుపు కోసం ఉపయోగిస్తారనే చర్చ నడుస్తోంది.