జన సైనికులకు జోష్ లో నింపే వార్త ఒకటి బయటకు

జన సైనికులకు జోష్ లో నింపే వార్త ఒకటి బయటకు వచ్చింది. వారాహి రెండో విడత యాత్ర అతి త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

తొలి విడత యాత్ర జూన్ 30 తో ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 14న అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 10 నియోజకవర్గాల్లోయాత్ర సాగింది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ విరుచుకుపడ్డారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏంచేస్తామన్న దానిపై కూడా ప్రజలకు స్పష్టతనిచ్చారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభించింది. రికార్డుస్థాయిలో అంచనాలకు మించి జనాలు వారాహి యాత్రకు తరలివచ్చారు.

రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ వెల్లడి కాకున్నా.. అతిత్వరలో ఉంటుందని తెలుస్తుండడం మాత్రం జన సైనికుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇప్పటికే పవన్ సినిమా షూటింగులకు బ్రేక్ చెప్పి విజయవాడ చేరుకోవడంతో యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్ని నియోజకవర్గాల్లో చేపడతారు? ఎక్కడ ముగిస్తారు? అన్నదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

రెండో విడత యాత్రలో పవన్ మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జన సైనికులు కోరుతున్నారు. ముఖ్యంగా జనసేన కీలక నాయకులు, అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలని విన్నవిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుతో పాటు ఆశావహులను పరిచయం చేస్తే మరింత జోష్ వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో లేనిపోని సమస్యలు వస్తాయన్న వాదన వినిపిస్తోంది. జనసేనకు సింబల్, అభ్యర్థులతో పనిలేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పొత్తుల్లో భాగంగా ఏ నియోజకవర్గం నుంచి జనసేన పోటీచేస్తుందో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోతుందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో తొలి విడత యాత్ర పూర్తయ్యింది. ఇంకా 24 నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. వీటన్నింటినీ కవర్ చేసేలా జనసేన వర్గాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అవి దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండో విడత యాత్రను పూర్తిచేయాలన్న ఆలోచనతో పవన్ ఉన్నారు. తొలి విడత సక్సెస్ కావడంతో.. దానిని కొనసాగింపుగా త్వరితగతిన రెండో విడత యాత్ర చేపడుతున్నారు. ఒకటి రెండు నెలల్లో సినిమాలు పూర్తిచేసి.. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.