పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై..డిసెంబర్లో దేశవ్యాప్త ఉద్యమం..!పోరుమామిళ్ళ సుబ్బారాయుడు పిలుపు..!

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 21:

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబరులో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు అఖిలభారత మునిసిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధానకార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు వెల్లడించారు.

 

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని , దీనిపై న్యూఢిల్లీలోని సఫాయీ కర్మచారీ కమిషన్ కార్యాలయం ఎదుట డిసెంబర్లో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుబ్బారాయుడు పిలుపునిచ్చారు.

 

తాడేపల్లిగూడెం మునిసిపల్ అండ్ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

 

మంగళవారం కపర్థీ భవన్ లో జరిగిన సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు ఏడిద నానీ అధ్యక్షత వహించారు.

పి. సుబ్బారాయుడు మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీలలో పనిచేసే కార్మికులకు విషవాయువుల కారణంగా తీవ్ర అస్వస్థత కలుగుతోందని, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతున్నాయని అలాంటి బాధితులకు ముప్పై లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని సుబ్బారాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.

తడి చెత్త పొడి చెత్త వేరు చేసే బాధ్యతను కూడా పారిశుద్ధ్య కార్మికులపైనే మోపుతున్నారనీ అది కూడా కార్మికుల ఆరోగ్యాన్ని హరిస్తున్నదన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

దీనిపై యూనియన్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతోందని అన్నారు.

అనేక రాష్ట్రాల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని , అందులో మన రాష్ట్రం కూడా ఒకటని సుబ్బారాయుడు అన్నారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోగా , సంఘాలమధ్య విభేదాలు రాజేస్తున్నదని అన్నారు. పాలకపక్ష అనుకూల సంఘాలను ప్రోత్సహించి ఉద్యమాలను అణచివేసే చర్యలు చేపడుతున్నదని సుబ్బారాయుడు అన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ విభాగాల కార్మికుల మధ్య వేతన వ్యత్యాసాలు , ఆలవెన్స్ ల వ్యత్యాసాలు చూపడం తగదని సుబ్బారాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారం కోసం చేపట్టే పోరాటాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ పోరాటాలు చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని అన్నారు. కార్మిక సంఘాలను పటిష్టంగా తయారు చేయాలని , సంఘనాయకత్వాలు మరింత చైతన్యవంతంగా పోరాటాలను రూపొందించాలని కోరారు. ఎనభై ఏళ్ల క్రితం అమరజీవి కామ్రేడ్ కపర్థీ స్థాపించిన మునిసిపల్ వర్కర్స్ యూనియన్ కు నాలుగోతరం వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని , తరవాతి తరం నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారు మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నా , తగిన స్పందన లేదని , సంఘటితంగా పోరాడితేనే కదలిక వస్తుందని అన్నారు. ఈ నెల 27,28 తేదీల్లో విజయవాడలో జరగనున్న కార్మికుల మహాధర్నా విజయవంతం చేయాలని కోరారు.

ఏ. ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరీ వీర్రాజు మాట్లాడుతూ పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచాలని, సరైన పనిముట్లు ఇవ్వాలని, వాహనాల కండిషన్ ను మెరుగుపరచాలని , అప్ కాస్ సిబ్బంది సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

 

మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.లక్ష్మీనారాయణ , ఏరియా కమిటీ నాయకుడు మందలపర్తి హరీష్ , మునిసిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అల్లం వీర వెంకటలక్ష్మి , కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కొడమంచిలి చంద్రరావు , నున్న బాల త్రిపుర సుందరరావు తదితరులు మాట్లాడారు.

 

తొలుత యూనియన్ పతాకాన్ని సీనియర్ కార్మికురాలు తాడికొండ దుర్గ ఎగురవేశారు. అమరజీవి కామ్రేడ్ ఎంవిఎన్ కపర్థీ చిత్రపటానికి యూనియన్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

 

అనంతరం పర్మనెంట్ కార్మికుల కమిటీకి అల్లం కుమారస్వామి అధ్యక్షునిగా , అల్లం వీర వెంకటలక్ష్మి కార్యదర్శిగా , ముత్యాల జగదీష్ , కోశాధికారిగా , తాడి కొండ దుర్గ, ఉప్పాటి రవీంద్ర , కాకి కోటమ్మ ఎన్నికయ్యారు.

 

కాంట్రాక్ట్ కార్మికుల కమిటీకి తాడికొండ కనక మహాలక్ష్మి అధ్యక్షురాలిగా , మండేల్లి జయసుధ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా, రౌతు రాజేష్ ఉపాధ్యక్షునిగా , కొడమంచిలి చంద్రరావు ప్రధానకార్యదర్శిగా , మండేల్లి సత్యనారాయణ కార్య నిర్వాహక కార్యదర్శిగా , అల్లం నరేంద్ర కుమార్ , మండేల్లి రామకృష్ణ సహాయ కార్యదర్శులుగా , కే.కాటమరాజు కోశాధికారిగా , శివశంకర్ సహాయ కోశాధికారిగా , మరో 21 మంది సభ్యులుగా నూతనకమిటీ ఎన్నికయ్యింది.