మత్స్యకారులకు అవసరమైన మరింత ప్రోత్సాహం అందిస్తాం: జిల్లా కలెక్టర్ : పి.ప్రశాంతి..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: నవంబర్ 21:

 

మత్స్యకారులకు అవసరమైన మరింత ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు.

 

మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఓపెన్ ఆడిటోరియం లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మత్స్యకార కుటుంబాలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతమై ప్రతి ఒక్కరూ మరింత అభివృద్ధి చెందాలన్నారు. చేపలు తినడం వల్ల మీ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారని కితాబు ఇచ్చారు. కొత్త సాంకేతికను ఉపయోగించుకుని చేపలను నాణ్యతగా సాగు చేసుకోవాలని, వాటికి మార్కెట్ ధర కూడా బాగుంటుందన్నారు. రైతులు ముందుకు వస్తే మరిన్ని మినీ ఫిష్ ఔట్ లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని ద్వారా మంచి లబ్ధి పొందవచ్చన్నారు. మత్స్యకారులు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోకి డి బి టి ద్వారా ఎటువంటి అడ్డంకులు లేకుండా జమ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. మత్స్యకార సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించి కార్పొరేషన్ సొసైటీ, నాబార్డ్ ద్వారా రుణాలు మంజూరు చేయించి వీలైన ఎక్కువమందికి మత్స్యకారులకు వ్యాపారం చేసుకునేందుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు నైపుణ్యం శిక్షణ కేంద్రాలు ఉండగా నరసాపురం మండలం పీఎం లంక గ్రామంలో అత్యాధునిక పరికరాలు, మెరుగైన ఫ్యాకల్టీ, ఎక్కువ సామర్థ్యంతో ఉందన్నారు. పిల్లలు చదువులు మధ్యలో మానేసిన వారు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతుల్లో కోర్సులు తీసుకొని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఒక మంచి మార్గమని ఆమె అన్నారు. పీఎం లంకలో ఆక్వా రంగానికి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఇక్కడ అత్యాధునిక పద్ధతుల్లో మత్స్య సంపదను పొందేందుకు సంబంధించిన కోర్సులను కూడా ఇస్తారని ఆమె అన్నారు. మత్స్యకారులు తమ ఆరోగ్యంపై, విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమె అన్నారు. మత్స్యకారులు తమ పిల్లలను బాగా చదివించుకోవాలని, బాల్యవివాహాలు చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రాణం పై బెరుకు లేకుండా, తెగింపుతో వేటకు వెళ్లే మత్స్యకారుల కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తే వారు మంచి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆమె అన్నారు. మీ ప్రాంతాలకు చెందిన రేవు ముత్యాలరాజు, పూజ ఐఏఎస్ లను స్ఫూర్తిగా తీసుకొని తమ పిల్లలను చదివించాలన్నారు. నరసాపురం మండలంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు చదువుకునేందుకు వస్తారని, వారిని చూసి ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు చదువుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారని అన్నారు. ఎన్నో జిల్లాలు హార్బర్ కోసం పోటీ పడితే స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవతో హార్బర్ ను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు.

 

మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు అండ్రాజు చల్లారావు మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆయా పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. జిల్లాలో 19 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఏకైక తీర ప్రాంతం బియ్యపుతిప్ప నుండి ముళ్ళపర్రు అని, గత ప్రభుత్వంలో కేవలం 274 మత్స్య కుటుంబంతో రిజిస్టర్ కాబడి ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో సుమారు 15 వందల కుటుంబాలు రిజిస్టర్ కాబడ్డాయని అన్నారు. వారందరికీ మత్స్యకార భరోసా అందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా 4 వేలు నుండి 10 వేలకు పెంచి వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు బాసటగా నిలిచారని ఆయన అన్నారు. బియ్యపుతిప్ప గ్రామంలో సముద్రపు వేటకు వెళ్లి నాగరాజు అనే వ్యక్తి మరణించారని ఆయనకు ప్రమాద బీమా ఐదు లక్షలు రూపాయలు పొందేందుకు దరఖాస్తు చేయగా వివిధ కారణాలచే బీమా సొమ్ము రాలేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించి వెంటనే మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సాంప్రదాయ మత్స్యకారులను కూడా గుర్తించి వారికి మత్స్యకార భరోసా 30,000 ఇవ్వాలని తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. మత్స్యకారులు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

 

ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు . అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం ఆదర్శనీయమైనదని గతంలో ఎన్నడూ ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.

 

ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల లబ్ధిదారులకు 60 శాతం, సాధారణ సామాజిక వర్గానికి చెందిన వారికి 40 శాతం సబ్సిడీతో వాహనాలను అందించడం జరుగుతుందని, ఈ సందర్భంగా సాధారణ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ.20 లక్షలు విలువ కలిగిన మినీ ఫిష్ కంటైనర్ వాహనాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు అందజేయడం జరిగింది. అనంతరం చిన్న తరహా చేపల మార్కెట్ నిర్వహిస్తున్న లబ్ధిదారులకు మెమొంటో లను అందించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్ వి ఎస్ ప్రసాద్, జడ్పిటిసి తిరుమాని బాపూజీ, జిల్లా మత్స్యకార సంఘం ఉపాధ్యక్షులు నాగిడి భానుమూర్తి, కాసవరపు శ్రీనివాసు, జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ లు కొప్పనాతి నరసింహస్వామి, తిరుమాని సీతామహాలక్ష్మి, మైల వెంకట సుబ్బారావు, వాతాడి పుష్ప, పి ఏ సి ఎస్ అధ్యక్షులు బర్రె సీతారామరాజు పేరుపాలెం, ఒడుగు సత్యనారాయణ పీఎం లంక, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ తిరుమాని కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.