Headlines

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా బలహీనపడిన ‘మాండుస్’

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న తుఫాను ఇపుడు బలహీనపడింది. అతి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ తుఫాను గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు కారైక్కాల్, చెన్నైలోని డాప్లర్ వెదర్‌ రాడార్లతో పరిశీలిస్తున్నట్టు ఐఎండీ తెలిపింది.

ప్రస్తుతం వాయువ్య దిశగా పయనించి ఈ అర్థరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోటల మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటనుంది. తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనావేశారు. అలాగే, తుఫాను తీరాన్ని దాటే సమయంలో సముద్రపు అలలు అర మీటరు ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మాండుస్ తుఫాను ప్రభావం అధికంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికంగా కనిపిస్తుందని, దీనివల్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.