Headlines

తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్‌ మీద ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్‌ పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ ఆవర్తనం రాబోయే రెండు మూడురోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని, మరో ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారుగా ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపింది.

ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో 300కు పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. 191 రైళ్లను దారి మళ్లించారు. 406 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. భారీ వర్షాల ధాటికి హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్ లోవర్ష తీవ్రత అధికంగా ఉంది. పెద్ద సంఖ్యలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద ధాటికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా 90 మంది మరణించారు. 16 మంది గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.