ప్రపంచ గుర్తింపు పొందిన 17 ఏళ్ళ భారతీయ యువతీ

 ప్రపంచ గుర్తింపు పొందిన 17 ఏళ్ళ భారతీయ యువతీ

17 ఏళ్ల వయసులోనే ప్రపంచ గుర్తింపు సాధించింది. పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో అనుక్షణం పనిచేసింది. ఆమె ఆలోచనలు, విజన్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌కు సైతం ఆశ్చర్యం కలిగించాయి. వెంటనే ఆమెను తమ తరపున భారత్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ రీజనల్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు యూఎన్‌ ప్రకటించింది.
గుజరాత్‌కు చెందిన ఖుషి చిందాలియా వయసు 17 సంవత్సారాలు. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు..? కాలేజ్‌లో చదువుకుంటూ ఫ్రెండ్స్‌తో సరదాగా తిరుగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఖుషీ మాత్రం అలా చేయలేదు. ఆమెకు చిన్నప్పటి నుంచే పర్యావరణం, ప్రకృతి అంటే మక్కువ ఎక్కువ. మనిషి చేస్తున్న తప్పుల కారణంగా ప్రకృతికి నష్టం కలుగుతోందని ఆవేదన చెందుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రత్యేకంగా టుంజా ఎకో-జెనరేషన్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీనికోసం దరఖాస్తులు అందజేయాల్సిందిగా ఆన్‌లైన్‌లో కోరుతుంది. ఈ తరుణంలోనే ఖుషీ కూడా యూఎన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అంబాసిడర్‌ స్థానానికి దరఖాస్తు చేసుకుంది. అందులో ప్రకృతి పట్ల ఆమె ఆలోచనలు, ఆశయాలను పొందుపరిచింది. పర్యావరణ రక్షణకు తాను ఏ విధంగా పాటుపడాలనుకుంటోందో వివరించింది. ఖుషీ అలోచనలను ఎంతగానో మెచ్చుకున్న యూఎన్‌.. వెంటనే యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రీజనల్ అంబాసిడర్‌ ఆఫ్‌ ఇండియాగా ఆమెను నియమించింది. దీంతో ఖుషీ ఆనందానికి అవధుల్లేవు.

యూఎన్‌ తరపున పర్యావరణ పరిరక్షణకు ఎంపిక కావడంపై ఖుషీ మాట్లాడుతూ, తనపై యునైటెడ్‌ నేషన్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అంటోంది. ఇది ఓ మహత్తర బాధ్యత అని, దానిని నిర్వర్తించేందుకు తాను ఎంతో కృషి చేస్తానని చెబుతోంది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే అవకాశం లేనందున, ఆన్‌లైన్‌లోనే పర్యావరణంపై అందరికీ అవగాహన కల్పించేందకు కార్యక్రమాలు నిర్వహిస్తానని వివరిస్తోంది. శభాష్‌ ఖుషీ..! పర్యావరణాన్ని కాపాడేందుకు నీవు చేస్తున్న కృషి ప్రశంసనీయం. నీలాంటి భావీ భారత పౌరులే దేశానికి కావాలి.

Related post