ఎంజీఎం హాస్పిటల్‌పై తీవ్రంగా స్పందిస్తున్న అభిమానులు

 ఎంజీఎం హాస్పిటల్‌పై తీవ్రంగా స్పందిస్తున్న అభిమానులు

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాని జయించినా.. ఇతర సమస్యల కారణంగా ఆయన మృతి చెందారని ఎంజీఎం హాస్పిటల్‌ సిబ్బంది వెల్లడించారు. అయితే బాలు కోలుకుంటున్నాడని, మ్యూజిక్‌ వింటున్నారని, ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్నారని ఆయన తనయుడు చరణ్‌ చెబుతుంటే.. సంగీత ప్రపంచమే కాదు.. బాలు అభిమానులందరూ ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఎంతో సంతోషించారు. కానీ సడెన్‌గా ఆయనకు సీరియస్‌గా ఉందనే వార్తలు వచ్చిన 24 గంటల్లో ఆయన మరణవార్త వినాల్సి రావడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో కొందరు ఎంజీఎం హాస్పిటల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. డబ్బు కోసమే ఇన్నాళ్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు.
అయితే అలాంటిదేమీ లేదని, దయచేసి అలాంటి రూమర్స్ వ్యాపింప చేయవద్దని చెబుతూ ఎస్‌.పి. చరణ్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్‌.పి. బాలు హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి, ఈ నెల 24 వరకు ఎంజీఎం డాక్టర్స్ ఎంతో కేర్‌ తీసుకున్నారని, డాక్టర్స్ కూడా ప్రార్థనలు చేశారని తెలిపారు. ప్రతి విషయంలోనూ వారు వెన్నంటే ఉన్నట్లుగా తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రతిరోజూ బాలు ఆరోగ్యం గురించి తెలుసుకునేవారని తెలిపారు. డబ్బు విషయంలో కూడా వస్తున్న రూమర్స్ నిజం కాదని తెలిపారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ సృష్టించి తమని బాధపెట్టవద్దని ఆయన కోరారు. నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదని, ఇలాంటి టైమ్‌లో ఇటువంటి వార్తలు మమ్మల్ని మరింతగా బాధపెడతాయని గమనించాల్సిందిగా “ఎస్‌.పి. చరణ్‌ వీడియో ద్వారా కోరారు.

Related post