వినియోగించని కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్‌

 వినియోగించని కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్‌
  • వినియోగించని కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్
  • ‌డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులు స్వయంగా కోరితేనే తిరిగి ఆన్‌లైన్‌ సేవలు
  • ఏటీఎం, పీవోఎస్‌ లావాదేవీలు యథాతథం

రేపటి నుంచే అమల్లోకి మార్గదర్శకాలు
డెబిట్ కార్డులు, క్రెడిట్‌ కార్డులు ఉండి.. ఇప్పటిదాకా వాటితో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపకపోతే.. ఇకపై ఆ కార్డులపై ఈ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆ కార్డులతో తిరిగి ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపాలనుకుంటే కార్డుదారులు స్వయంగా ఆయా బ్యాంకులను కోరాల్సి ఉంటుంది. దేశంలో జరిపే లావాదేవీలతోపాటు అంతర్జాతీయంగా జరిపే లావాదేవీలకూ ఇది వర్తించనుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలను అరికట్టేందుకుగాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్న వివిధ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అక్టోబరు 1 (గురువారం) నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ ఆన్‌లైన్‌ లావాదేవీలకు మాత్రమే దీనిని వర్తింపజేస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు మాత్రం స్వదేశంలో ఆన్‌లైన్‌ సేవలకూ ఈ నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకులు భద్రతపరంగా కలిగి ఉన్న సాంకేతిక సామర్థ్యం మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కార్డుదారే స్వయంగా పరిమితి విధించుకోవచ్చు. ఏటీఎం, పీవోఎస్‌, ఎన్‌ఎ్‌ఫసీ, ఈ-కామర్స్‌ లావాదేవీలు మాత్రం యథాతథంగా కొనసాగనున్నాయి. అయితే వీటిని ఎప్పుడంటే అప్పుడు నిలిపేసుకోవడం, తిరిగి కొనసాగించడం కూడా కార్డుదారే స్వయంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎ్‌ఫసీ (కాంటాక్ట్‌లెస్‌) సౌకర్యం ద్వారా కార్డు పిన్‌ నంబరుతో పనిచేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎ్‌ఫసీ (కాంటాక్ట్‌లెస్‌) సౌకర్యం ద్వారా కార్డు పిన్‌ నంబరుతో పనిలేకుండా రోజుకు రూ.2 వేల వరకు లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఇకపై దీనిని అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకునే అవకాశం కార్డుదారుకు లభించనుంది. ఈ సౌకర్యాల ద్వారా మోసాలను అరికట్టే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్‌ నిపుణులు అంటున్నారు. కార్డుదారులు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

Related post