Headlines

కేసీఆర్ నామినేషన్ వేసేది ఆ రోజే: రెండు నియోజకవర్గాల నుంచి ఒకేసారి, వరుస సభలతో దూకుడు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన స్థానాలకు అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్.. నవంబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.

ఇది ఇలావుండగా, వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. మొదట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అంతేగాక, అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్.

అక్టోబర్ 15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు.

అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోనుంది. మూడోసారి సీఎం కేసీఆర్ కావడం కాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.