కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం

 కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం

చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల పాటు తీవ్ర స్థాయిలో జరిగే యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడానికి భద్రతా బలగాలకు అధికారం ఇచ్చింది. దీంతో సుమారు రూ.50 వేల కోట్లతో ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడానికి భద్రతా బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయుధాలు, మిస్సైళ్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్‌తో ఒకేసారి యుద్ధం వచ్చినా మన బలగాలు ఎదుర్కొనే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో పది రోజుల వరకూ సరిపడా ఆయుధాలను సిద్ధంగా ఉంచుకునేందుకే అనుమతి ఉండేది.

గత కొంత కాలంగా వాస్తవాధీన రేఖ దగ్గర చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటు వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి సమీపంలో భూటాన్ భూభాగంలో ఏకంగా రోడ్లు, గ్రామాలను నిర్మించేస్తోంది. అయితే చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం కూడా దీటుగానే బదులిస్తోంది. ఇప్పటికే తూర్పు లఢాక్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇప్పుడీ తాజా నిర్ణయంతో భద్రతా బలగాల్లో మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది.

Related post