కపిల్‌దేవ్ రికార్డునే బ్రేక్ చేసిన అగార్కర్

టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. మరి అలాంటి బ్యాట్స్‌మన్ వెస్టిండీస్‌పై అదే ఏడాది 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే, భారత జట్టులో ఆ తర్వాత పలువురు పేరొందిన బ్యాట్స్‌మెన్ కొనసాగినా వాళ్లెవరికీ సాధ్యంకాని ఆ రికార్డును ఓ పేసర్ బద్దలుకొట్టాడు.
అదెవరో కాదు.. టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన అజిత్ అగార్కర్. ఈ ముంబయి ఆల్‌రౌండర్ ఆ ఘనత సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..
21 బంతుల్లో..
2000 డిసెంబర్ 14న జింబాబ్వే.. భారత పర్యటన సందర్భంగా రాజ్‌కోట్‌లో ఐదో వన్డే ఆడింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు భారత్ పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించింది. సచిన్ తెందూల్కర్(27), రాహుల్ ద్రవిడ్(6), యువరాజ్(29), వీరేంద్ర సెహ్వాగ్(19) లాంటి మేటి బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. హెమంగ్ బదాని(77; 99 బంతుల్లో 2×4, 1×6), రీతిందర్ సోధి(53; 67 బంతుల్లో 4×4, 1×6), అజిత్ అగార్కర్(67; 25 బంతుల్లో 7×4, 4×6) ఆదుకున్నారు. లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగిన అగార్కర్ వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. అప్పటిదాకా నత్తనడకన సాగిన స్కోర్‌బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా అతడు రెచ్చిపోవడంతో ఎడాపెడా బౌండరీలు వచ్చాయి. దీంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలోనే అగార్కర్ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో 1983 నాటి కపిల్ దేవ్ రికార్డును 17 ఏళ్ల తర్వాత అతడు బద్దలుకొట్టాడు.
52 బంతుల్లో 3 వికెట్లు తీసి 26 పరుగులిచ్చాడు..
అనంతరం జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగడంతో అగార్కర్ ఈసారి బంతితో రెచ్చిపోయాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అతడు వేసిన 8.4 ఓవర్లలో 3.10 ఎకానమీతో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. దానికితోడు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అగార్కర్‌కు తోడు మరోవైపు నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (2/37), రీతిందర్ సోధి (2/43), శ్రీధరన్ శ్రీరామ్ (2/50) తమ వంతు బౌలింగ్ చేశారు. దీంతో జింబాబ్వే 47.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. భారత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో ట్రెవర్ మాడొండో(71; 70 బంతుల్లో 10×4) ఒక్కడే రాణించాడు. ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో తర్వాత బంతితో మయా చేసిన అగార్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా, ఈ ముంబయి పేసర్ భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గానూ మరో ఘనత తన పేరిట నమోదు చేసుకున్నాడు.