మార్స్ పై దిగిన నాసా మినీ హెలికాప్టర్.

 మార్స్ పై దిగిన నాసా మినీ హెలికాప్టర్.

నాసాకు చెందిన ఇన్‌జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్‌పై దిగింది. ఫిబ్రవరి 18న మార్స్‌పై ల్యాండైన పర్సీవరెన్స్ రోవర్ కింది భాగంలో ఈ మినీ హెలికాప్టర్‌ను ఫిక్స్ చేశారు. 47 కోట్ల కిలోమీటర్ల పాటు నాసా పర్సీవరెన్స్ రోవర్‌తోపాటు ప్రయాణం చేసిన ఈ మినీ హెలికాప్టర్‌.. ఇవాళ రోవర్ ఉదర భాగం నుంచి మార్స్ ఉపరితలంపైన దిగింది. ఇక అది ఈ రాత్రి మనుగడ సాగించడమే తర్వాతి లక్ష్యం అని నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ ఆదివారం ట్వీట్ చేసింది. హెలికాప్టర్ మార్స్‌పై దిగిన ఫొటోను పర్సీవరెన్స్ తీసింది.

ఇన్నాళ్లుగా పర్సీవరెన్స్ పవర్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటున్న ఈ హెలికాప్టర్ ఇక తన సొంత బ్యాటరీ సాయంతో మనుగడ సాగించాల్సి ఉంటుంది.

మార్స్‌పై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకూ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాంటి వాతావరణంలో ఇది మనుగడ సాగించడం అంత సులువు కాదు. ఇందులోని హీటర్ హెలికాప్టర్‌కు 7 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ అందించగలుగుతుంది.

వచ్చే రెండు రోజుల పాటు ఇంజెన్యూయిటీ టీమ్ ఈ హెలికాప్టర్ సోలార్ ప్యానెల్స్‌ను చెక్ చేయనుంది. ఆ తర్వాత బ్యాటరీని రీఛార్జ్ చేసి, తొలిసారి ఎగిరే ముందు మోటార్లు, సెన్సార్లను పరిశీలించనుంది. ఈ నెల 11న ఈ హెలికాప్టర్ తొలిసారి ఎగిరే ప్రయత్నం చేయనుంది. భూమి సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న మార్స్‌పై ఇది ఎగరడం అంత సులువు కాదు. అదే సమయంలో భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు మాత్రమే మార్స్ గురుత్వాకర్షణ శక్తి ఇది ఎగరడానికి సాయం చేయనుంది. తొలి ప్రయత్నంలో భాగంగా పది అడుగుల మేర పైకి ఎగిరి, 30 సెకన్ల పాటు అక్కడే ఉండి తిరిగి కిందికి దిగనుంది.

Related post