తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పతాక స్ధాయికి చేరింది.

 తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పతాక స్ధాయికి చేరింది.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పతాక స్ధాయికి చేరింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పక్షాలతో పాటు వామపక్షాల అభ్యర్ధి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈనెల 17వ తేదీన ఎన్నికలు ఉండటంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారాన్ని ఇంటింటికీ చేయటం ప్రారంభించారు. అధికార, ప్రతిపక్షాల నేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వైసీపీకి అండగా ఉన్న ఓటు బ్యాంక్‌లో ఉన్న అసంతృప్తిని తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. సంస్ధాగత బలంలేని బీజేపీ, జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రచారంపై కొండంత ఆశలు పెట్టుకుంది. గతంలో కంటే మెజార్టీని ఎక్కవగా సాధించాలని అధికార పార్టీ నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. మొత్తం మీద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో రాజకీయ సందడి ప్రారంభమైంది.

రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత అతిపెద్ద ఉప ఎన్నిక తిరుపతిలో జరగనుంది. ఇప్పటికే అన్ని పక్షాల అభ్యర్ధులు తమ బలాబలాలను, బలగాలను సమీకరించుకుంటున్నారు. ప్రచారాన్ని పూర్తిస్ధాయిలో చేపట్టారు. ప్రధానంగా తిరుపతిలో గతంలో అధికార పార్టీకి అండగా ఉన్న వర్గాలను, అందులో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆ ఓటు బ్యాంక్‌‌పై ప్రధానంగా దృష్టి సారించింది. క్లస్టర్‌ కార్యాలయాల ద్వారా అసంతృప్తిగా ఉన్న నేతలకు టీడీపీ నేతలు గాలం వేస్తున్నారు. తిరుపతిలో 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. అప్పట్లో వైసీపీకి 2014లో 47.84 శాతం, 2019లో 55.03 శాతం ఓట్లు సాధించింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజివర్గాల సమీకరణ వైసీపీకి వరంగా మారింది. ఈ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

Related post