‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా సింధు

 ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా సింధు

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ఈఎస్‌పీఎన్‌ గురువారం ప్రకటించిన అవార్డుల్లో సింధు ‘ఈ ఏటి మేటి మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈఎస్‌పీఎన్‌ ఫిమేల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలవడం సింధుకిది వరుసగా మూడోసారి. పురుషుల విభాగంలో యువ షూటర్‌ సౌరభ్‌ వర్మ ఈ అవార్డును అందుకున్నాడు. 2019 ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో సౌరభ్‌ ప్రదర్శన అతనికి ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ఈ మెగా టోర్నీలో సౌరభ్‌ 5 స్వర్ణాలతో మెరిశాడు. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగాల్లో రెండు పసిడి పతకాలను గెలుచుకున్న సౌరభ్‌… మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మరో 3 స్వర్ణాలను హస్తగతం చేసుకున్నాడు. అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోన్న ఒడిశా స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు ‘కరేజ్‌’ అవార్డు లభించింది. 

పునరాగమనంలో అద్భుత విజయాలు సాధిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ‘కమ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని అందుకుంది. బిడ్డకు జన్మనిచ్చాక రెండేళ్లు ఆటకు దూరమైన హంపి… గతేడాది డిసెంబర్‌లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమె విశ్వ విజేతగా అవతరించింది. రెజ్లర్‌ దీపక్‌ పూనియా ‘ఎమర్జింగ్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకోగా… బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్‌ పతక విజేతలను తయారు చేసిన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ‘కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌ గెలిచిన క్షణం ‘మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైంది. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆకట్టుకున్న మను భాకర్‌–సౌరభ్‌ చౌదరి జోడీకి ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు దక్కింది. మాన్సీ జోషికి ‘ పారా అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం దక్కగా… జీవిత కాల సాఫల్య పురస్కారం హాకీ లెజెండ్‌ బల్‌బీర్‌ సింగ్‌కు దక్కింది.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *