రోహిత్ శతకం, కుల్దీప్ మాయాజాలం.. భారత్ ఘన విజయం

 రోహిత్ శతకం, కుల్దీప్ మాయాజాలం.. భారత్ ఘన విజయం

భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి శతకంతో కదంతొక్కిన వేళ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 40.1 ఓవర్లోనే చేధించింది. వన్డే సిరీస్‌లో 1-0తో పైచేయి సాధించింది. 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 114 బంతుల్లో 137 పరుగులు చేసి రో‘హిట్’ అజేయంగా నిలిచాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 18వ శతకం. భారత సారథి విరాట్ కోహ్లీ (75 పరుగులు, 82 బంతుల్లో) కూడా బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేధించింది.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 27 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మోయిన్ బౌలింగ్‌లు రషీద్‌‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుకుపడ్డాడు. రోహిత్ శర్మ, కోహ్లీ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించడంతో భారత్‌ విజయం నల్లేరుపై నడకే అయ్యింది. జట్టు స్కోర్ 226 వద్ద రషీద్ బౌలింగ్‌లో కోహ్లీ స్టంపవుటై వెనుదిరిగినా.. లోకేశ్ రాహుల్ (9 పరుగులు, 18 బంతులు)తో కలిసి రోహిత్ లాంఛనం పూర్తి చేశాడు.

అంతకుముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 6 వికెట్లతో అదరగొట్టడంతో ఇంగ్లండ్ జట్టు 268 పరుగులకే ఆలౌటయ్యింది. వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లకు 71 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లిష్ జట్టును కుల్దీప్ తన మణికట్టు మాయాజాలంతో చావుదెబ్బ తీశాడు. 10 ఓవర్లలో 25 పరుగులిచ్చిన కుల్దీప్ 6 వికెట్లు పడగొట్టి వన్డేల్లో మరో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *