Headlines

విషాదంలో సినీ ఇండస్ట్రీ……సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయనను చివరిసారి చూసేందుకు అభిమానులు, సినీ నటులు తరలి వస్తున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లకు అధికారులను ఆదేశించారు. ఇక ప్రముఖుల దర్శనం కోసం కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామగూడలోనే ఉంచనున్నారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత ప్రముఖుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు.

వివిధ ప్రాంతాల్లో ఉన్నా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కృష్ణను చివరిసారిగా చూసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియానికి తరలించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం వరకు అక్కడే ఉంచి ఆ తరువాత పద్మాలాయ స్టూడియోస్ కు తరలించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిపే అవకాశం ఉందని కృష్ణ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మొన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న కృష్ణ ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడు.

ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తరువాత సినీ ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లింది. ఆయన లేరనే విషయం తోటి నటులు, ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్న ఆయన కుమారుడు, ప్రిన్స్ మహేశ్ బాబును పలువురు ఓదార్చుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఆయనకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విదేశాల్లోని కొందరు అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా విచారాన్ని వ్యక్తం చేశారు. కృష్ణ ఆరోజుల్లో సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారని, ఎంతో మందిని ఆదుకున్నారని అంటున్నారు. అటు రాజకీయాల్లోనూ కృష్ణ తనదైన ముద్ర వేసినందున కొందరు రాజకీయ నాయకులు కృష్ణ ను చూసేందుకు వస్తున్నారు.