కరీంనగర్ లో హై అలెర్ట్ : ఇండోనేషియా వచ్చిన విదేశీయులు 8మందికి పాజిటివ్‌

 కరీంనగర్ లో హై అలెర్ట్ : ఇండోనేషియా వచ్చిన విదేశీయులు  8మందికి పాజిటివ్‌

కరీంనగర్ నగరంలో మూడు రోజుల కిందట కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన ఇండోనేషియా బృందంలో 8మందికి పాజిటివ్‌ తేలడంతో కరీంనగర్‌ హైఅలర్ట్‌ అయింది. ఆ బృందం నగరంలో పర్యటించిన కలెక్టరేట్‌ ప్రాంతానికి మూడు కిలోమీటర్లమేర ఇండ్లను పోలీసులు నిర్బంధించి 144 సెక్షన్‌ విధించారు. 100మందితో కూడిన వైద్య బృందం ప్రతి ఇంటికీ వెళ్లి సుమారు ఎనిమిది వేల మందికి వైద్య పరీక్షలు చేసింది. మరోవైపు వేములవాడలో ఆర్జిత సేవలన్నీ నిలిపేశారు. ఎల్లారెడ్డిపేటకి గల్ఫ్‌ నుంచి వచ్చిన 90మందిని గృహనిర్బంధం చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా అనుమానితులను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఈ నెల 13న ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మందితో కూడిన బృందానికి కరోనాలు లక్షణాలు గుర్తించి కరీంనగర్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో పరీక్షించారు. అక్కడి నుంచి వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ బృందంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఒక్కసారిగా కరీంనగర్‌ ఉలిక్కిపడింది. ఆ బృందంతో సన్నిహితంగా ఉన్న మరో ఎనిమిది మందిని గుర్తించి బుధవారం రాత్రే హైదరాబాద్‌కు తరలించారు. అయితే, వారికి పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్టు తెలియడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గురువారం కరీంనగర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించిన పభుత్వం.. ఆ బృందం పర్యటించిన కలెక్టరేట్‌ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంది. కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్లమేర ఇండ్లన్నింటినీ పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 100మంది వైద్య బృందం గురువారం ఒక్కరోజే 10వేల మందిని పరీక్షించాలని లక్ష్యంగా రంగంలోకి దిగగా, సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది వేల మందిని పరీక్షించారు.

News 9

Related post