Headlines

రాజీవ్‌ సక్సేనాతో పాటు ఆయన భార్యను కూడా ఈడీ అధికారులు అరెస్ట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సెస్మిక్‌ సర్వే కంపెనీ ఆల్ఫాజియో (ఇండియా)కు చెందిన రూ. 16 కోట్ల విలువైన ఫిక్సెడ్‌ డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. ఫెమా చట్టం కింద ఈ జప్తు చేసింది. కంపెనీకి రావాల్సిన మొత్తాన్ని ఫెమా నిబందనలకు విరుద్ధంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో దాచినట్లు ఈడీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. దేశంతో పాటు విదేశాల్లో కూడా గ్యాస్‌, చమరు అన్వేషణ, ఉత్పత్తి చేసే కంపెనీలకు ఆల్ఫాజియో తన సేవలను అందించింది. సిస్మిక్‌ డేటా సర్వే కోసం అవసరమైన వివిధ పరికరాలను ఫ్రాన్స్‌, సింగపూర్‌, నెదర్లాండ్స్‌ నుంచి ఆల్ఫాజియో దిగుమతి చేసుకుంటోంది. ఇలా దిగుమతి చేసుకున్న పరికరాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆల్ఫాజియో కంపెనీ యూఏఈలోని మ్యాట్రిక్స్‌ గ్రూప్‌ డీఎంసీసీ ద్వారా చెల్లించింది.

అయితే ఇలా దిగుమతి చేసుకున్నవాటికి అధిక బిల్లులు చూపి మ్యాట్రిక్స్‌కు పంపారు. అయితే వాస్తవ విలువ కంటే అధికంగా పంపిన మొత్తాన్ని మ్యాట్రిక్స్‌ గ్రూప్‌ దాచినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇలా దాచిన మొత్తాన్ని ఆల్ఫాజియో కంపెనీ ఛైర్మన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేష్‌ ఆళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడినట్లు ఈడీ గుర్తించింది. ఇలా 25,34,628 డాలర్లను దాచినట్లు ఈడీ పేర్కొంది.దీనికి సమానమైన మొత్తం రూ. 16 కోట్ల మేరకు కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రాజీవ్‌ సక్సేనా ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడు. యూఏఈలో ఉన్న ఆయన కంపెనీ మ్యాట్రిక్స్‌ గ్రూప్‌ డీఎంసీసీ ద్వారా భారీ ఎత్తున నిధులు చేతులు మారాయని ఈడీ ఆరోపించింది. ఛార్టెడ్‌ అకౌంట్‌ అయిన రాజీవ్‌ సక్సేనాతో పాటు ఆయన భార్యను కూడా ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసి జైల్లో ఉంచారు. ప్రస్తుతం వారు బెయిలుపై ఉన్నారు.