MLA చల్లా ధర్మారెడ్డి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్య

పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వమని వ్యాఖ్యానించారు. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. నడికుడ మండలం రాయపర్తి గ్రామంలో జరిగిన సభలో ధర్మారెడ్డి మాట్లాడారు. దళితుల బంధు పథకంలో లబ్ధిపొందిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడం లేదని చెప్పారు. కామారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో మరోసారి ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. పరకాల నియోజకవర్గంలో చాలా మంది దళితులు నివసిస్తున్నారని, అందరికీ న్యాయం చేయాలన్నారు. వారిని దళిత బంధు పథకంలో చేర్చడం లేదా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామన్నారు.

‘మన నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలు ఉన్నాయి. ఒక్క పరకాలలోనే మూడు పెద్ద కాలనీలు ఉన్నాయి. ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి. అక్కడ 200 ఇచ్చిన సరిపోవట్లే. తప్పకుండా దళిత బంధు ఉగాదిలోపు 12 మంది ఇస్తాం. తర్వాత కొద్దిగా ఎక్కువ పెడతాం. వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినొళ్లకు దళిత బంధు ఇయ్య. దళిత బంధు ఇచ్చినొళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇయ్య. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి. త్వరలో అధికారులు గ్రామానికి వస్తారు. ఆ 12 మందిలో కూడా నలుగురే వస్తాయి. 1500 ఇచ్చినట్టే ఇచ్చి.. 500 మాత్రమే వచ్చాయి.’ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పారు. దళిత బంధు పథకంలో భాగం కావాలో, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ, దళితుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ తప్పుడు వాగ్దానాలు చేసి ఆంక్షలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు దుయ్యబట్టారు. నియోజకవర్గంలో పథకాలు సక్రమంగా అమలు చేయకుంటే ఎమ్మెల్యేపై ఆందోళనకు దిగుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.