ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపే అవసరమైన సరకులు

 ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపే అవసరమైన సరకులు

జిల్లా ప్రజలు వారికి అవసరమైన నిత్యావసర సరకులను  ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే కొనుగోలు చేయాలని, అంతకుమించి ఎక్కువ దూరం వెళ్లకూడదని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపే అవసరమైన సరకులన్నీ సమకూర్చుకోవాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని, అలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంలో మరిన్ని రైతుబజార్లు ఏర్పాటుచేస్తామని, కూరగాయలకు కొరత లేకుండా చూస్తామన్నారు. రైతులు తమ ఉత్పత్తులను బజార్లకు తేవడానికి ఏడు పల్లెవెలుగు బస్సులు ఏర్పాటుచేశామన్నారు. అలాగే వీధుల్లో చిన్న చిన్న దుకాణాలు కూడా తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చామని, ఎవరైనా సరే సామాజిక దూరం పాటిస్తూ విక్రయాలు చేయాలని సూచించారు.

జిల్లాలో 42 లక్షల మంది ప్రజలు వుండగా వారిలో అత్యవసర పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న 16 వేల మందికి పాస్‌లు జారీ చేశామని, వాటిని చూపిస్తే పోలీసులు ఎక్కడా అడ్డగించరని వివరించారు. విద్యుత్‌, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్‌, టెలికాం రంగాలకు చెందిన వారికి ఈ పాస్‌లు ఇచ్చామని చెప్పారు.

వేపగుంట, ఎంవీపీల్లో రెండు షెల్టర్లు

ఇతర ప్రాంతాలకు చెందినవారు కొంతమంది విశాఖపట్నంలో చిక్కుకుపోయారని, వారు సొంత గ్రామాలకు ఇప్పట్లో వెళ్లే అవకాశం లేనందున అటువంటి వారి కోసం వేపగుంట శిక్షణ కేంద్రంలో ఒక షెల్డర్‌, ఎంవీపీ కాలనీలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో మరొక షెల్డర్‌ ఏర్పాటుచేశామని చెప్పారు.

Author News9

Related post