విరామ సమయాన్ని ప్రణాళికతో సద్వినియోగం

కరోనాతో ప్రస్తుతం ఏర్పడిన కల్లోల వాతావరణం త్వరలోనే తగ్గుముఖం పడుతుందని… పరిస్థితులు చక్కబడతాయని ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ద్రోణవల్లి హారిక అభిప్రాయపడింది. క్రీడాకారుల కెరీర్‌లో ఖాళీ సమయం చాలా తక్కువ సందర్భాల్లో దొరుకుతుందని… ఊహించని విధంగా లభించిన విరామ సమయాన్ని ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటున్నానని ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మూడుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన హారిక తెలిపింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీలో పాల్గొని తిరిగొచ్చిన హారిక హోం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఆదివారంతో స్వీయ నిర్బంధం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే…

స్విట్జర్లాండ్‌లోని లుసానేలో మార్చి 1 నుంచి 13 వరకు జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నాను. 14వ తేదీన స్విట్జర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. కరోనా కట్టడికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నేను విదేశం నుంచి రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. ఆదివారంతో అధికారికంగా నా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గడువు పూర్తయింది. అంతా సవ్యంగా ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు స్వయంగా వచ్చి ధ్రువీకరించారు. స్వీయ నిర్బంధం ముగిసినా నేను ఇంట్లోనే ఉంటున్నాను. లాక్‌డౌన్‌ను పాటిస్తు న్నాను. కొంతకాలం నుంచి విరామం లేకుండా టోర్నమెంట్‌లు ఆడుతున్నాను. స్విట్జర్లాండ్‌ నుం చి వచ్చాక  నాలుగైదు రోజులపాటు ఒకే గదికి పరిమితమయ్యాను. ఆటకు వారం రోజులపాటు బ్రేక్‌ ఇచ్చాను. క్వారంటైన్‌ పూర్తవ్వడంతో మళ్లీ చెస్‌పై దృష్టి పెట్టాను. అయితే అంత సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేయడంలేదు. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటం కోసం వ్యాయామం, యోగా చేస్తున్నాను. ఆగస్టులో మాస్కోలో జరగాల్సిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కారణంగా దాదాపు అన్ని క్రీడాంశాల్లో టోర్నీలు రద్దు కావడం లేదంటే వాయిదా పడటం జరిగింది.

Author News9

Related post