సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

 సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి గోపి (27) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు రాంచీ నుంచి ఉన్నతాధికారులు తెలపడంతో మృతుడి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.  చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి వెంకటరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు రాయపూడి గోపీ 2017 మార్చి నెలలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఎన్‌టీపీసీ సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు.

గోపీ బుధవారం రాత్రి 10 గంటలకు తమకు ఫోన్‌ చేసి మామూలుగానే మాట్లాడాడని, 9 గంటలకు డ్యూటీకి వచ్చినట్లు చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. 10.45 గంటలకు రాంచీ నుంచి అధికారులు ఫోన్‌చేసి గోపీకి సుస్తీ చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని,  ఫోన్‌ చేశారని, 11.45 గంటలకు మళ్లీ ఫోన్‌చేసి గోపి గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తమ బిడ్డ ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదని, ఏం జరిగి ఉంటుందో తమకు తెలియడం లేదని తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గోపికి 2019 మే నెలలో ప్రకాశం జిల్లా పేరాల గ్రామానికి చెందిన లక్ష్మీశ్రావణితో వివాహమైంది. గోపీ జనవరి నెలలో సంక్రాంతి పండుగకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి జనవరి 27వ తేదీన భార్యతో సహా రాంచీకి వెళ్లాడు. గోపీ భార్య లక్ష్మీశ్రావణి ప్రస్తుతం రాంచీలోనే ఉంది. గోపీ మృతదేహాన్ని అధికారులు శుక్రవారం రాత్రికి చింతాయపాలెం తీసుకొస్తారని బంధువులు తెలిపారు.

Related post