బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం

కేంద్రం వైఖరికి నిరసగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో చెడింది కాబట్టే ఇలాంటి ఆందోళనలు చేస్తున్నాంటూ మండిపడ్డారు. వీరిద్దరి పంచాయితీని రైతుల పంచాయితీగా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇద్దరి మధ్యలో రైతులను బలి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “BRS పార్టీకి, BJP పార్టీకి చెడింది కాబట్టి.. మీ పంచాయితీ రైతుల పంచాయితీ చేస్తున్నారా? రైతు కల్లాల కోసం ఖర్చు చేసిన పైసలు తిరిగి ఇవ్వమంటున్నారని.. ధర్నాలకు,నిరసనలకు పిలుపునిస్తూ మధ్యలో రైతులను బలిచేయాలని చూస్తున్నారా? 8 ఏండ్లలో 8 వేల మంది రైతులు చనిపోతే ఏ రోజైన కేసీఆర్ ప్రభుత్వానికి రైతుల గోస కనబడిందా..?అని నిలదీశారు. “రైతుల గోస ఏనాడైనా మీ కంటికి కనపడిందా? రైతు బంధు ఇస్తున్నామని, రైతులకు మేలు చేసే రాయితీలు అన్నీ బంద్ పెట్టి.. రైతు చస్తే రూ.5లక్షల సాయం అని, బతికి ఉన్నప్పుడు ఆదుకోని మీరు.. ఈ రోజు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నారు.

దేశ రైతుల కోసం BRS పార్టీని విస్తరిస్తున్నారా? మీది కిసాన్ కిల్లర్ సర్కార్. ఈ రోజు రైతులు ధర్నాలు చేయాల్సింది .. ప్రగతి భవన్ ముందు. నిరసనలు చేయాల్సింది ఫామ్ హౌస్ ముందు. రైతులు ఉతికి ఆరేయాల్సింది రైతు పేరిట అప్పులు తెచ్చి .. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన బీఆర్ఎస్ పార్టీని” అని ఫైర్ అయ్యారు. మరోవైపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఉపాధి హామీ నిధులతో పంట కల్లాలను కట్టకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తీరును ఖండిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.