Headlines

కాంగ్రెస్ కు గుడ్ న్యూస్-అశోక్ గెహ్లాట్ తో సచిన్ పైలట్ రాజీ..!

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీకి అన్నీ శుభసూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పరిస్ధితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు పలు సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీకి మరో గుడ్ న్యూస్ లభించింది.

కొన్నేళ్లుగా రాజస్తాన్ కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా విడిపోయి పోట్లాడుకుంటున్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు అధిష్టానం చొరవ చూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వారం క్రితం అసంతృప్త నేత సచిన్ పైలట్ ను పిలిపించుకుని మాట్లాడారు. గెహ్లాట్ తో రాజీపడితే భవిష్యత్తును తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పైలట్ చల్లబడ్డారు.

అధిష్టానంతో వారం రోజుల క్రితం జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో సచిన్ పైలట్ ఇవాళ సోషల్ మీడియా స్టేటస్ మార్చారు. క్షమిస్తున్నా, మర్చిపోతున్నా అంటూ పైలట్ ఇవాళ పెట్టిన స్టేటస్ చూస్తే అది గెహ్లాట్ ను ఉద్దేశించేననే చర్చ జరుగుతోంది. తద్వారా గెహ్లాట్ తో పాత గొడవల్ని మర్చిపోయి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పైలట్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ లో మరోసారి కలిసి పోరాడేందుకు మార్గం సుగమమైంది.

గెహ్లాట్ తో విభేదాల కారణంగా కొంతకాలంగా సచిన్ పైలట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెంచుతున్నారు.బీజేపీ నేత వసుంధరారాజే సింధియా అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ దీక్షలు కూడా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి రాజస్తాన్ లో అధికారం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గెహ్లాట్ తో రాజీకి పైలట్ సిద్ధంకావడం కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.