నీట్ గ్రేస్ మార్కుల తొలగింపు.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష..!

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) వివాదంపై సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ సూచనల మేరకు 1563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అదేవిధంగా, పరీక్ష సందర్భంగా విలువైన సమయం కోల్పోయిన విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 23న ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి జూన్ 30 లోగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. ఈ నిర్ణయంతో నీట్ రాసిన విద్యార్థులు అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొంది. ఒకవేళ తిరిగి పరీక్ష రాసేందుకు నిరాకరించిన వారికి గత పరీక్షలో వచ్చిన మార్కులనే (గ్రేస్ మార్కులు కాకుండా) పరిగణనలోకి తీసుకుని తిరిగి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపింది.

 

ఏంటీ వివాదం..

నీట్ పరీక్ష నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 1563 మంది విద్యార్థులు విలువైన సమయం కోల్పోయారు. ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాలలో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద టైం వృథా అయింది. దీనిపై బాధిత విద్యార్థులు ఆందోళన చేయడంతో వారికి గ్రేస్ మార్కులు కలిపారు. ఫలితం మాత్రం విపరీతంగా వచ్చింది. గ్రేస్ మార్కులు కలపడంతో 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. హరియాణాలోని ఓ పరీక్ష కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థులు ఆరుగురికి ఫుల్ మార్కులు వచ్చాయి.

 

దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్ష పత్రం లీక్ అయిందనే వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ పరిణామాలతో పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కౌన్సెలింగ్ ఆపేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం కోర్టు.. విద్యార్థుల ఆరోపణలపై స్పందించాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను ఆదేశించింది.

 

విచారణ కమిటీ..

నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తాజాగా నివేదిక ఇచ్చింది. ఈ సూచనల మేరకు గ్రేస్ మార్కులు తొలగింపు, బాధిత విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది.