హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సుఖ్వీందర్ గతంలో పీసీసీ చీఫ్‌గా పని చేయగా, అగ్నిహోత్రి గతంలో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వీరితో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిమ్లాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిహోత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. ముఖ్యంగా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ అధికారం చేపట్టబోదని గతంలో దుష్ప్రచారం చేశారనీ, కానీ, తాము బీజేపీ రథానికి బ్రేకులు వేశామని ఆయన తెలిపారు. పాల వ్యాపారి నుంచి సీఎం స్థాయికి.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త నేతను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన ఎవరో కాదు. ఓ పాల వ్యాపారి. పైగా, కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
17 యేళ్ల వయసులో కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగారు. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇపుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే అంటే తన బాల్యంలో పాలు అమ్మి కుటుంబ పోషణలో తన వంతు పాత్ర పోషించారు. ఆయనే ఇపుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పేరు సుఖ్వీందర్ సింగ్ సుఖు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సుఖ్వీందర్ సింగ్ తండ్రి ప్రభుత్వ రవాణా సంస్థలో డ్రైవరుగా పనిచేశారు. ఈయన చదువుకునే రోజుల్లో పాలు అమ్మారు. ఛోటా షిమ్లాలో ఓ పాల బూత్‌ను కూడా నిర్వహించారు. 1964 మార్చి 27వ తేదీన జన్మించిన సుఖ్వీందర్ సింగ్… హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి ఏంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంస్థలో చురుకుగా పని చేశారు. షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌గా కూడా పని చేశారు. అలాగే అంచలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. గత 2003లో హమిర్‌పూర్‌లోని నాదౌన్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇటీవలి ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 వరకు హెచ్.పి.సి.సి చీఫ్‌గా ఉన్నారు.