Headlines

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) ట్విస్టుల మీద ట్విస్టులు

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల వేదికగా హస్తం పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తోంది. మోదీ టార్గెట్ గా ఆరోపణలు సంధిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంటులోనే పీఎంని కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం రావడం సంచలనంగా మారింది. వెంకట్ రెడ్డి తీరు.. కాంగ్రెస్ పార్టీ సహా భువనగిరి (Bhuvanagiri) పార్లమెంట్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

అయితే.. ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏవీ లేవని వెంకట్ రెడ్డి అనుచరులు అంటున్నారు. మూసీ నది ప్రక్షాళనకు రూ. 3 వేల కోట్లు కేటాయించాలని కోరేందుకే మోదీని కలుస్తున్నారని చెబుతున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగా తరహాలోనే మూసీ (Musi River) నదిని శుభ్రం చేయాలని వెంకట్ రెడ్డి కోరనున్నారట. దీంతో పాటుగా భువనగిరి నియోజవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా ప్రధానిని అభ్యర్థించనున్నారని తెలుస్తోంది.

అయితే.. వెంకట్ రెడ్డి కేవలం అభివృద్ధి అభ్యర్థనలకే పరిమితమవుతారా లేక మోదీతో రాజకీయ చర్చలు ఏమైనా చేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరడంతో… వెంకట్ రెడ్డి కూడా అదే బాటలో వెళతారన్న ఊహాగానాలు జోరుగా సాగుతోన్న నేపథ్యంలో మోదీతో కేవీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై చర్చించానని.. అరగంటపాటు సమయం ఇచ్చి, ఖర్గే అంతా విన్నారని .. సమావేశం అనంతరం వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఖర్గే చెప్పారని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ మధ్యే కీలక కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఎన్నికలకు ఒక నెల ముందు వరకు రాజకీయాల గురించి మాట్లాడబోనని.. వచ్చే ఏడాది జనవరి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తానని వెల్లడించారు.