సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తన తడాఖా ఏంటో చూపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తు చిత్తుగా ఓడించింది. తమ పవర్ హిట్టింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపారు ఢిల్లీ బ్యాటర్లు.
సాల్ట్, మార్ష్, రుస్సో జోరుతో 182 పరుగుల టార్గెట్ ను 16.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది ఢిల్లీ. 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్లలో సాల్ట్ (45 బంతుల్లో 87 పరుగులు ; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రిలీ రుస్సో (22 బంతుల్లో 35 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (17 బంతుల్లో ; 3 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ వార్నర్ (14 బంతుల్లో 22 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్, హర్షల్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
182 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫస్ట్ బంతి నుంచే ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. డేవిడ్ బాయ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
దీంతో.. ఈ జోడి ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హేజల్ వుడ్ విడదీశాడు. అతని బౌలింగ్ లో 22 పరుగులు చేసిన వార్నర్ బాయ్.. డుప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 60 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది ఢిల్లీ. డేవిడ్ వార్నర్ ఔటైనా.. తమ దూకుడు ఆపలేదు ఢిల్లీ బ్యాటర్లు.
సాల్ట్ తో కలిసిన మిచెల్ మార్ష్ కూడా తన బ్యాట్ కు పనిచెప్పాడు. ఈ ఇద్దరూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, వీరిద్దరి జోరుకు హర్షల్ పటేల్ బ్రేకులు వేశాడు. 17 బంతుల్లో 26 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ను ఔట్ చేశాడు. దీంతో.. 119 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ రుస్సో కూడా తన హిట్టింగ్ పరవ్ ఏంటో చెప్పాడు.
సాల్ట్ తో కలిసి ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టాడు. ఈ ఇద్దరూ పోటీపడీ మరీ ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో.. 182 పరుగుల భారీ టార్గెట్ కాస్తా చిన్నదిగా మారింది. ఆఖర్లో 87 పరుగులు చేసిన సాల్ట్.. కర్ణ్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. కానీ, అప్పటికే ఆర్సీబీకి జరగాల్సిన నష్టం జరిగింది. చివర్లో అక్షర్ మెరుపులతో విజయం ఢిల్లీ సొంతమైంది.
అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 55 పరుగులు ; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మహీపాల్ లోమ్రర్ ( 29 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, ఈ మ్యాచులో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఏడు వేల పరుగుల మార్క్ ని అందుకున్న తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక, ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ లకు చెరో వికెట్ దక్కింది.