Headlines

బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నాటక విఫల హామీలు ? టార్గెట్ అదేనా !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేసేశాయి. దీంతో ఎన్నికలకు సరిగ్గా 12 రోజుల ముందు బీజేపీ తమ మ్యానిఫెస్టో ప్రకటించింది.

అయితే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలను కూడా చేర్చింది. ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన హామీల్ని తిరిగి తెలంగాణలో ఇవ్వడంతో వాటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఈ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయించి మిగతా రాష్ట్రాల్లో తమకు అధికారమిస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెబుతోంది. అయితే దీని ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది అమల్లోకి వస్తే జరిగే లాభనష్టాలపై ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడమే. ఇదే క్రమంలో తాజాగా కర్నాటక ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

కానీ ఇప్పుడు వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి హామీతో పాటు ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత హామీని కూడా కర్నాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణలోనూ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఏపీలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను కల్పించారు. ముస్లింలలో వెనుకబాటు ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం అప్పటి నుంచే వీటిని మతపరమైన రిజర్వేషన్లుగా పేర్కొంటూ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించింది.

ఇలా కర్నాటక ఎన్నికల్లో విఫలమైన హామీల్ని తీసుకొచ్చి తిరిగి తెలంగాణలో కూడా ఇవ్వడం ద్వారా బీజేపీ టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పోలరైజేషన్ కోసమే బీజేపీ ఈ హామీలు ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అదీ గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో విఫలమైన హామీల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఇవ్వడం ద్వారా బీజేపీ ఏం కోరుకుంటోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమై వెనుకబడిపోయిన కాషాయ పార్టీ ఇప్పుడు వివాదాస్పద అంశాల్ని కెలికి ఓట్ల పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.