ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి.. హార్డ్ డిస్క్‌లు దొరికేశాయ్..!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన ఆధారాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ బృందానికి మరో కీలక హార్ట్ డిస్క్‌లు లభించాయి. ఎస్ఐబీకి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు సీజ్ చేశారు. ఇందులో మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసస్‌తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.

 

సోదాలు..ఆధారాలు

ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇంటితోపాటు కార్యాలయంలో సిట్ సోదాలు నిర్వహించింది. దీంతోపాటు బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో సైతం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ల్యాబ్ ప్రతినిధులు స్టేట్ మెంట్‌లను కూడా సిట్ రికార్డు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా రవికుమార్ ఇంట్లో దాచి పెట్టిన హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

మలుపు తిప్పుతాయా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు.. ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంట్లో లభ్యమైన హార్డ్ డిస్క్‌లు కేసు దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ అందిరిలోనూ నెలకొంది. కాగా, ప్రతిపక్ష నేతల ఇళ్లతోపాటు మూడు జిల్లాలో ల్యాబ్ మినీ కంట్రోట్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. అయితే రవికుమార్‌ను విచారిస్తారా? నోటీసులు జారీ చేశారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.