Headlines

మహానీయుల ఆశయాలతో ముందుకెళ్తాం..

మహానీయుల ఆశయాలతో ముందుకెళ్తాం…

– గద్దరన్న కుటుంబాన్ని వాడుకున్న కాంగ్రెస్‌ పార్టీ

– కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రాష్ట్రానికి..దేశానికి పట్టిన శని

– మంథనిలో గద్దరన్న విగ్రహాన్ని కాంగ్రెస్‌ పార్టీ నెలకొల్పాలే

– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

 

అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలతో ముందుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ జయంతి, ప్రజా యుద్ద నౌక గద్దర్‌ వర్థంతి సందర్బంగా మంథని పట్టణంలోని రాజగృహాలో గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన బొక్కలవాగు వంతెనపై ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇద్దరు కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ తెలంగాణ సాధనలో ఉద్యమానికి ఊపిరిపోస్తే ప్రజా యుద్దనౌక గద్దరన్న తెలంగాణ ప్రజా చైతన్యం కోసం పని చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజా యుద్దనౌకగా గద్దరన్న గొప్ప చరిత్రను సమాజానికి చూపించారని అన్నారు. అయితే ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ అని, కాంగ్రెస్‌ పార్టీ నమ్మించి మోసం చేయడం అలవాటేనని అన్నారు. ఆనాడు సాధారణ ఎన్నికల్లో గద్దరన్న పేరును అభిమానులను వాడుకుని ఆయన కూతురు వెన్నెలకు టికెట్‌ ఇచ్చి అందలం ఎక్కారని అన్నారు. ఎన్నికల కోసం సమాజాన్ని వాడుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరిని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవకాశం ఉన్నా గద్దరన్న కూతురుకు టికెట్‌ ఇవ్వలేదని, రాజకీయ అవకాశానికి దూరం చేశారని అన్నారు. ఈ సమాజంపై కాంగ్రెస్‌ పార్టీకి ప్రేమలేదని, కేవలం అధికారం కోసమే ఆరాటపడుతారనేది ప్రజలు గమనించాలన్నారు. ఆనాడు గద్దరన్న పేరును అవార్డులు ఇస్తామని ప్రకటన చేశారే కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదని, కనీసం విధివిధానాలు కూడా ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మన ఓటును మనమే వినియోగించుకోకపోవడం మూలంగానే ఈనాటికి కాంగ్రెస్‌ పార్టీ అనాది ఆలోచనతోనే ముందుకు పోతాందన్నారు. మేధావులైన కోదండరాం, ఆవునూరి మురళీలాంటి వాళ్లు ఆలోచన చేయాలని, ఇంకా కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలుకడం మానుకోవాలన్నారు. గద్దరన్న మహనీయులలోఒకడుగా నిలువాలని, అందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. అలాగే మంథని గద్దరన్న విగ్రహాన్ని కాంగ్రెస్‌ పార్టీ నెలకొల్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విగ్రహ ఏర్పాటు చేయకపోతే తాను పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా నెలకొల్పుతామని ఆయన స్పష్టం చేశారు. మహనీయుల స్పూర్తితో సమాజాన్ని మేలుకొల్పేలా కవులు కళాకారులను సమాయాత్తం చేస్తామని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.