Headlines

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. కాని షేర్‌ మాత్రం నష్టాల్లో ముగిసింది. తనకు ఉన్న హోటల్‌ బిజినెస్‌ను విడిగా లిస్ట్‌ చేస్తుందని గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి.

కంపెనీ కూడా ఇదే తరహా సంకేతాలు ఇచ్చింది. ఈ వార్తలతో ఐటీసీ షేర్‌ క్రమంగా పెరుగుతూ… ఇటీవల రూ 499.60లను తాకింది. డీమెర్జర్‌ వార్తను ఇవాళ ఐటీసీ ప్రకటించింది. హోటల్‌ బిజినెస్‌ కంపెనీని లిస్ట్‌ చేస్తామని, కొత్త కంపెనీలో ఐటీసీకి 40 శాతం వాటా ఉంటుందని ప్రకటించింది. వదంతుల ఆధారంగా షేర్‌ ధర పెరగడం, ఆ వార్త రాగానే లాభాలు స్వీకరించడం మార్కెట్‌లో మామూలే. అలాగే ఇవాళ ఐటీ షేర్‌లో లాభాల స్వీకరణ వచ్చింది. దీంతో షేర్‌ దాదాపు నాలుగు శాతం తగ్గింది. మరోవైపు ఐటీసీ ప్రకటించిన డీమర్జర్‌ రేషియో పట్ల ఇన్వెస్టర్లలో అసంతృప్తి ఉన్నట్లు కొన్ని షేర్‌ బ్రోకింగ్‌ సంస్థలు అంటున్నాయి. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌లో 4 శాతం హోటల్‌ బిజినెస్‌ నుంచి వస్తోంది. ఈ లెక్కన హోటల్‌ బిజినెస్‌ కంపెనీ విలువ రూ. 18300 కోట్లని, షేర్‌ విలువ రూ. 15గా జెఫరీస్‌ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. పైగా మిగిలిన వాటాదారులు కూడా అమ్మకాలకు పాల్పడే అవకాశముంది. ముఖ్యంగా మాతృసంస్థ BAT కూడా షేర్లను అమ్మవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని… షేర్‌ లిస్టింగ్‌ వరకు వెయిట్‌ చేయాలని మరికొన్ని బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. అలాగే కంపెనీలోని ఆగ్రి, ఐటీ విభాగాలను కూడా ఇలాగే విభజిస్తారా అన్న చర్చ కూడా మార్కెట్‌లో మొదలైంది. మరి డీమర్జర్‌కు సంబంధించి మరింత సమాచారం ఆగస్టు 14న జరిగే బోర్డు సమావేశంలో వెల్లడి కావొచ్చని తెలుస్తోంది. మరి ఐటీసీ షేర్‌లో ఒత్తిడి కొనసాగుతుందా… లేదా ర్యాలీ మళ్ళీ ప్రారంభమౌతుందా అన్నది చూడాలి.