Headlines

గుమ్మిలేరు వజ్రోత్సవ వేడుకలకు సిద్ధం.పంచాయతీ ఆవిర్భావం 25 మార్చి 1949.అభివృద్ధిలో అందరికీ ఆదర్శం..

పచ్చని పంట పొలాల మధ్య కొలువుతీరి ఉంటుంది ఆ గ్రామం.పంటలకే కాదు పాడికి పెట్టింది పేరు. మేలు జాతి ఆవులు గేదెలకు ప్రసిద్ధి.ఆ ఊరు ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామపంచాయతీ 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలో అడుగుపెడుతుంది.వజ్రోత్సవ వేడుకలకు సిద్దమవుతుంది. ఈ గ్రామపంచాయతీ 25 మార్చి 1949లో ఆవిర్భవించింది.2279 మంది జనాభా,807 కుటుంబాలతో ఉండే ఈ గ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హిందువులు ఉండే ఈ గ్రామంలో గల పురాతన జైన్ దేవాలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. మండపేట పట్టణానికి కూత వేటు దూరంలో ఉండే ఈ గ్రామం సిరి సంపదలకు పేరెన్నికగన్నది. పాడిపంటలే గాక రైస్ మిల్లులు ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందినవి.ఆర్థికంగా స్థితిమంతులు అధికంగా ఉండే ఈ గ్రామంలో వివాదాలకు చాలా దూరంగా ఉంటారు.ఆ ఊరంతా ఒక కట్టుబాటు ప్రకారం నడుచుకుంటుంది. అందుకనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కువ శాతం ఏకగ్రీవం అవ్వడానికి కారణం అవుతుంది. ప్రస్తుతం ఉన్న పాలవర్గంతో పాటు గతంలోనూ పలు పాలవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. అదే ఆ గ్రామ గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

 

అభివృద్ధిలో అందరికీ ఆదర్శం

 

సరిగ్గా రెండేళ్ళ క్రితం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గుణ్ణం రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచినే కాదు మిగిలిన పాలవర్గాన్న ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు ఆ గ్రామస్థులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందుకుంది ఆ గ్రామ పంచాయతీ. కొత్తపేట నియోజకవర్గం లోని ఏకగ్రీవమైన ఏకైక పంచాయతీ ఇది. గ్రామపంచాయతీలకు నిధుల కొరత ఉన్నప్పటికీ ఈ గ్రామంలో మాత్రం అభివృద్ధి చకచకా జరుగుతుంది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డితో పాటు ఆ గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ రాంబాబు అభివృద్ధి పనులు చేపట్టడంలో ముందుంటున్నారు.సిమెంట్ రోడ్లు,డ్రైన్లు,తాగునీరు, విద్య,వైద్యం వంటి మౌలిక సదుపాయాలతో కలకలాడుతూ ఉంటుంది ఆ ఊరు. లక్షలాది రూపాయలతో అభివృద్ధి చెందింది.

 

ఉత్తమ పంచాయతీగా ఎంపిక

 

మార్చి నెల ముగుస్తున్నా ఇంకా అనేక పంచాయతీలు ఇంటి పన్నుల వసూళ్ళులో వెనుకబడి ఉన్నాయి. కాని ఈ గ్రామపంచాయతీ గది ఏడాది నవంబర్ లోనే 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన ఇంటి పన్నుల వసూళ్ళు పూర్తి చేసి జిల్లాలోని ప్రధమ స్థానం సాధించింది. ఆ గ్రామస్తులు అభివృద్ధి చేయించుకోవడంతో పాటు పన్నుల చెల్లింపులలోనూ ఆ విధంగానే ముందుంటారు. అందుకనే అది ఆదర్శ గ్రామమైంది. జిల్లా ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఆ గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు, గ్రామ కార్యదర్శి దంగేటి సుబ్బారావులు జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లా చేతులమీదుగా అవార్డులు తీసుకోవడానికి కారణమైంది.