పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబరు 24, 2023:
యస్సీ , యస్టి తెగలపై అఘాయిత్యాలు, నేరాలు నిరోధించేందుకు సంబంధిత అధికారులు, సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టి పెట్టాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు. శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో పౌర హక్కుల రక్షణ (PCR) మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అట్రాసిటీల నిరోధక (POA) చట్టాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగు సమావేశం జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా స్థాయి సమావేశంతో పాటు డివిజన్ స్థాయిలో కూడా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై పరిష్కారం ఆలస్యం అయినా, జరగకపోయినా సంబంధిత అధికారులను పిలిపించుకుని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. క్రిమినల్ కేసు విషయంలో బాధితులకు ఎంతవరకు నష్టపరిహారం అందించగలమో అంత పరిహారం అందించడం జరుగుతుందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు గ్రీవెన్స్ డే నిర్వహించామని అయితే ఒకటి, రెండు కేసులు మాత్రమే వచ్చాయని అందుచేత కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. సభ్యులు కోరిక మేరకు నెలకు ఓసారి ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ డే నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. జిల్లాలో 15 వేల 367 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని, 20 సంవత్సరాలు పైగా అనుభవిస్తున్న వారికి భూ హక్కు పత్రాలు అందించడం జరుగుతుందని, దీనివల్ల ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వారికి లబ్ధి జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నారు. బ్యాంకు లోన్ కి సబ్సిడీ లేదని, వాహనాలకు సబ్సిడీ కూడిన రుణాలు ఉన్నాయని కనుక వాహనాలు లోను తీసుకు రావడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. ఎస్సీ, ఎస్టీ ల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలు నూరు శాతం అమలు చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంబంధిత వర్గాల ప్రజల నుండి కేసులను పట్టించుకోవడం లేదు, సరైన న్యాయం జరగడం లేదు అని ఒక్క ఫిర్యాదు కూడా అందకుండా సంబంధిత అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కమిటీ సభ్యులు వారి సంక్షేమానికి విశేష కృషి చేయడంతో పాటు, లోటుపాట్లను గుర్తిస్తే ఎప్పటి కప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి నివృత్తిని చేశారు. జిల్లా ఎస్పీ యు .రవి ప్రకాష్ మాట్లాడుతూ వివిధ విభిన్న కారణాలతో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కొన్ని కేసులు కొన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతాయని, కొన్ని కేసులు సాక్షులు విచారించినప్పుడు, కోర్టులలో పెండింగు ఉండుటవలన ఆలస్యం అవుతుందన్నారు. దీని వల్ల బాధితులు ఎదురు చూడటం, పలుమార్లు అడగటం సహజమని, అయితే కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారని బాధాకరంగా ఉందన్నారు. కేసులు రిజిస్టరు చేసినప్పుడు అక్కడున్న పరిస్థితిని బట్టి సెక్షన్లు నమోదు చేస్తామని, దాన్నిబట్టి బాధితులకు సకాలంలో నష్ట పరిహారం అందుతుందని, ఒక్కోసారి ఆలస్యం అవుతుందన్నారు. సాధ్యమైనంత త్వరలో కేసులు పరిష్కారానికి పోలీసు శాఖ శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని సభ్యులకు జిల్లా ఎస్పీ యు. ప్రకాష్ తెలిపారు. కమిటీ సభ్యులు జిల్లెల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, సి యం మంగరాజు, టి జగజ్జీవన రావు, సింగం త్రిమూర్తులు, ఆహ్వానితులు సిహెచ్ వి.ఆర్ భరత్, యన్ జివో తోటకూర వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భీమవరం అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహానికి పూలమాలు వేసుకునే వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలన్నారు. గరగపర్రులో 110 మందికి ఇంకా నష్టపరిహారం అందలేదనీ, అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కొన్ని శిథిలావస్థకు చేరాయని, కొన్నిచోట్ల సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సభలకు,సమస్యల పరిష్కార మునకు వెళ్ళేటప్పుడు వాహనాలకు టోల్ టాక్స్ లేకుండా చూడాలన్నారు. మండల సమావేశాలు జరుగుచున్నప్పుడు ఒక తహశీల్దారు తప్ప మిగతా అధికారులు రావటం లేదన్నారు. చర్మకారులకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములు కొన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయన్నారు. చర్మకారులకు ఉపాధి, ఋణ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే ఎఫ్ఆర్ఐ నమోదు చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలి. తాడేపల్లిగూడెం మండలం అరుగొలను గురుకుల పాఠశాలలో రక్షిత మంచినీటి సదుపాయం సరిగ్గా లేదు. ఆర్ వో ప్లాంటు వెంటనే వేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పెంచాలన్నారు. వ్యాపారాలు చేసినందుకు రుణాలు మంజూరు చేయడం కోరారు. యస్సీ ,ఎస్టి బాధితులకు నష్టపరిహారం విషయంలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా బాగుందన్నారు. మిగతా పెండింగ్లో ఉన్న నష్ట పరిహారం చెల్లిస్తే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.కృష్ణవేణి, నరసాపురం ఆర్డీవో యం అచ్యుత అంబరీష్, భీమవరం ఆర్డీవో కె శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం ఆర్డీవో కె చెన్నయ్య, డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, దిశ యాక్టు డిఎస్పీ యన్ మురళీ కృష్ణ, డియస్పిలు బి శ్రీనాథ్, జివియస్ పైడేశ్వర రావు, సి శరత్ రాజ్ కుమార్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి కె శోభారాణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్ప రాణి, జిల్లా కోపరేటివ్ ఆడిట్ కార్యాలయం డిప్యూటీ రిజిస్టారు ఏ.అంబేద్కర్, జిల్లా ఆర్ & బి శాఖ అధికారి బి లోకేశ్వర రావు,జిల్లా పరిశ్రమలు అధికారి యు ఆదిశేషు, లీడ్ బ్యాంకు మేనేజరు ఎ నాగేంద్ర ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.