పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 27:
విద్యార్థులు నూతన పరిశోధనలను చేపట్టి కొత్త శిఖరాలను అధిరోహించాలని సెర్బ్ ప్రిన్సిపుల్ ఇన్వెస్ట్ గేటర్ డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రి సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, సెర్బ్ సంయుక్త ఆధ్వర్యంలో సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాన్ని బుదవారం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి గూడెం మహతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు హాజరై సెర్బ్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్బంగా నిర్వహించిన
సమావేశంలో శ్రీ ఫణికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు పాఠశాల స్తాయిలోనే పునాది వేసుకోవాలని చెప్పారు. చదువు, ఆధునిక సాంకేతికతతోపాటు అదనంగా మరిన్ని నైపుణ్యాలను నేర్చుకుని వాటిపై పట్టు సాధిస్తే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చన్నారు. విభిన్నమైన ఆలోచనలు ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని, అవి వారి వ్యక్తిత్వానికి మెరుగులుదిద్దేలా ఉండాలని తెలిపారు. విద్యార్థులు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటుచేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. మనుషులు చేసే పనులన్నింటిని కంప్యూటర్లు నిర్వహించేలా చేయటమే కృత్రిమ మేధస్సు టెక్నాలజి (ఏఐ) అని, ఈ సాంకేతికత భవిష్యత్తులో అన్ని రంగాల్లోను కీలకపాత్ర పోషిస్తుందన్నారు. యువత నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలను కేవలం తమ సొంతానికే వినియోగించకుండా సమాజహితం కోసం నూతన ఆవిష్కరణలను చేపట్టాలని వివరించారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ టి.రమేష్, డాక్టర్ పి.శంకర్, డాక్టర్ కిరణ్ తీపర్తి తదితరులు పాల్గొన్నారు.