Headlines

విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాలి..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 29:

 

విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాలని ఏపీ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుడు డాక్టర్ పెద్దపాటి శంకర్ విద్యార్థినిలకు సూచించారు. నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి అదేశాలమేరకు గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో పది, ఇంటర్మీడియేట్ చదువుతున్న 100 మంది విద్యార్థినులు శుక్రవారం నిట్ ప్రాంగణాన్ని సందర్చించారు. ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియం, గ్రంధాలయం, ప్రయోగశాలలు, వర్క్ షాపులను పరిశీలించి, ఆయా పరికరాల పనితీరు, ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో శంకర్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందని, విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకుంటే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చన్నారు. కళాశాల స్థాయిలోనే సృజనశీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు ఊపిరిపోసుకుంటాయని చెప్పారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే పుస్తకాలతో స్నేహం చేయాలని తెలిపారు. లక్యాలను సాధించడానికి ప్రతి విద్యార్థి అనునిత్యం శ్రమించాల్సిందేనన్నారు. ప్రతిభకు మార్కులే కొలమానం కాదని, కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకున్న వారి కొలువులకు కొదవ ఉండదని చెప్పారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ విభిన్న ప్రాజెక్టులు, ఆవిష్కరణలతో మెరవాలని సూచించారు. విద్యార్థినిల్లో స్ఫూర్తినింపేలా భారత శాస్త్రవేత్తల విజయ గాధలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థినిల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ టి.రమేష్, నవోదయ అధ్యాపకులు ఎం.సింహాద్రి, జయప్రకాష్, హేమలత, స్వాతి, లక్ష్మీప్రసన్న, యామిని సరస్వతి తదితరులు పాల్గొన్నారు.