భారీ మెజారిటీతో గెలిచి గూడెం సీటు జగన్ కు గిఫ్ట్ గా ఇద్దాం ..-డిప్యూటీ సీఎం కొట్టుసత్యనారాయణ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 16:

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మీద ఎంతో నమ్మకంతో, గౌరవంతో మనకు మళ్ళీ టికెట్ ఇచ్చారు…కాబట్టి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ భారీ మెజారిటీతో తాడేపల్లిగూడెం సీటును గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం శనివారం తొలిసారిగా ఆయన తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇడుపులపాయలో ఆనవాయితీగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద, తన పట్ల, కార్యకర్తలు, అభిమానుల పట్ల ఎంతో గౌరవంతో బాధ్యతను ఉంచి తనకు మళ్ళీ టిక్కెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇది మనందరికీ శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. మనమంతా కలసికట్టుగా, ఐకమత్యంగా పని చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. మనందరం మళ్లీ గర్వంగా తల ఎత్తుకొని తిరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి కొట్టు తెలియజేశారు. ఈ విషయం మనం గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేయడం ద్వారా తేటతెల్లమైందన్నారు. ఇదే సంతోషాన్ని, ఆనందాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే మనందరం గెలవవలసిన అవసరం ఉందన్నారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న గోదావరి జిల్లాలలో మన మీద ఎంతో గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో తనను గెలిపించి తాడేపల్లిగూడెం సీటును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని అభ్యర్థి కొట్టు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరం ఐకమత్యంతో ప్రజల దగ్గరకు వెళదామని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలందరూ ఆకర్షితులు అయినందున మళ్లీ తిరిగి గెలిచే పార్టీ కాబట్టి ఎక్కువ మంది టికెట్లు ఆశించడం సహజమన్నారు. ఆశావహులంతా అధినేత నిర్ణయానికి కట్టుబడి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.