Headlines

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏసీబీ.. రూ. 40 కోట్లకుపైగా అక్రమాస్తుల గుర్తింపు..

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ(ACB) సోదాలు చేపట్టింది. అశోక్‌‌నగర్‌లోని నివాసంతోపాటు ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు చేసింది.

 

ప్రస్తుతం ఉమామమహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారికగా ఉన్నారు. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు, సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పట్నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి.

 

ఏసీపీ ఉమా మహేశ్వరరావు అరెస్ట్

 

సోదాలు ముగిసిన అనంతరం సీసీఎస్ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఉన్న అయన నివాసంతో పాటు అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో రెండు ఇళ్లు సీసీఎస్ కార్యాలయం, నగరంలోని ఆయన మరో ఇద్దరి స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిగాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.40 లక్షలు, 65 తులాల బంగారం, భారీగా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీకి సంబంధించిన 17 చోట్ల స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రూ.3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో 4 ఇళ్లు గుర్తించామని అధికారులు తెలిపారు. శామీర్‌పేట, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో ప్లాట్లు కొన్నారని వెల్లడించారు. ఏసీపీకి సంబంధించి ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ. 40 కోట్ల కంటే ఎక్కువేనని తెలిపారు.