ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉండగా.. నిధుల కొరత కారణంగా చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో ఇవాళ్టి నుంచి నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే వీటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
రాష్ట్రంలో నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం బకాయిల్లో రూ.203 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మిగతా బిల్లులనూ వీలైనంత త్వరగా చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆరోగ్య శ్రీ సేవల్ని నెట్ వర్క్ ఆస్పత్రులు పునరుద్దరిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇవాళ్టి నుంచి యథావిధిగా సేవలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం 3 వేలకు పైగా చికిత్సలను నెట్ వర్క్ ఆస్పత్రుల ద్వారా అందిస్తోంది. వీటి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే నెట్ వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వంపై ఉున్న నమ్మకంతో ఖర్చు చేస్తున్న మొత్తం బిల్లుల రూపంలో పేరుకుపోతోంది. వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోవడంతో నెట్ వర్క్ ఆస్పత్రులు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సేవలు నిలిపేశాయి. నిన్న రాత్రి అత్యవసర చర్చలు జరిపినా ఫలితం లేదు. చివరికి ఇవాళ రూ.203 కోట్లు విడుదల చేయడంతో సేవలు పునరుద్ధరించారు.