పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..

 

పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

 

అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా… అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు..