కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో సంపూర్ణ బహిరంగ మల విసర్జన నివారణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్న తీరు పలు గ్రామాలకు ఆదర్శంగా ఉందని కేంద్ర ఓడిఎఫ్ బృంద సభ్యులు జి సురేంద్ర, బి రమణలు సర్పంచ్ తమన శ్రీనివాసును, పంచాయతీ కార్యదర్శి యు రేణుకను అభినందించారు. చెముడులంక గ్రామంలో వారు శుక్రవారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, నివాస గృహాలలలో గల మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే గతంలో బహిరంగ మలవిసర్జన చేసే ప్రాంతాలను పరిశీలించారు. గతానికి భిన్నంగా సంపూర్ణ బహిరంగ మల విసర్జన నివారణ గ్రామంగా పూర్తిగా మార్చిన సర్పంచ్ను, కార్యదర్శులను వారు అభినందించారు. అలాగే ఈ గ్రామంలో 954 గృహాలకు గాను 1511కుటుంబాలు నివాసాలు ఉంటున్నారని, ప్రతి గృహానికి సరిపడే మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తించారు. వీరి వెంట గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి యు రేణుక, సిబ్బంది ఎస్ సూరిబాబు, మాజీ సర్పంచ్ బి వీర వెంకట్రావు, దొండపాటి చంటి, మోటూరి సురేష్ పలువురు పాల్గొన్నారు.