ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం అని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకుంటూ 3 వ విడత వై.యస్.ఆర్.ఆసరా ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు 78.94 లక్షల మందికి 6,419.89 కోట్ల రూపాయలు కలిపి ఇప్పటి వరకు 19,178.17 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాలలోకి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం జమ చేసింది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
కొత్తపేటలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు జరిగిన వై.యస్.ఆర్.ఆసరా కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా 6297 పొదుపు సంఘాలకు 54 కోట్ల 77 లక్షల 35 వేల 379 రూపాయలు జమ చేయడం జరుగుతుంది అని, కొత్తపేట మండలంలో 1672 పొదుపు సంఘాలకు 15 కోట్ల 85 లక్షల 51 వేల 372 రూపాయలు జమ చేయడం జరుగుతుంది అని చిర్ల తెలియచేశారు. కొన్ని రకాల సాంకేతిక కారణాల రీత్యా వై.యస్.ఆర్.ఆసరా అందని పొదుపు సంఘాలకు కూడా ఈ సంవత్సరం మొత్తం నగదు జమ చేయనున్నారని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా నేరుగా వారి ఖాతాలలోకి ఈ డబ్బు జమచేయడం జరుగుతుంది అని, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు.
వై.యస్.ఆర్.ఆసరా పథకం ద్వారా మహిళల ఆర్ధిక స్వావలంబన కొరకు వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుంటారని ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చిర్ల అన్నారు.
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు కొట్టుకంటే సభా మర్యాదలకే ప్రమాదం అని, బాధ్యత గల పదవిలో ఉన్నందుకు అలా జరగకుండా చూడవలసిన బాధ్యత ఉండడం వలన హుటాహుటిన ఆపడానికి వెళ్తే కొట్టడానికి వెళ్లినట్టు తెలుగుదేశం వారు చిత్రీకరించారని, ప్రజలను మభ్యపెట్టి లబ్ధిపొందడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని చిర్ల వారికి చురకలు అంటించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.