సమ సమాజ స్థాపకుడు అంబేద్కర్ —డిప్యూటీ సీఎం కొట్టు నివాళి..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 6:

 

భారత రాజ్యాంగ రచన ద్వారా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమ సమాజ స్థాపకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి కొట్టు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయులంతా గర్వపడేలా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేలా ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు అంబేద్కర్ రాజ్యాంగం దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారని మంత్రి కొట్టు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగంలో సంస్కరణలు సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటుపడుతున్నారు అన్నారు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున నెలకొల్పుతున్నారన్నారు. సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అంబేద్కర్ స్మృతి వనం చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ దేశాల నుండి ఎవరు మన రాష్ట్రానికి వచ్చినా అంబేద్కర్ స్మృతి వనాన్ని కనీసం ఒక్కసారైనా చూసి వెళ్లాలనే విధంగా అంబేద్కర్ స్మృతి వనం రూపుదిద్దుకుంటున్నారు. వచ్చే నెలలో ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందన్నారు. స్మృతి వనం ఏర్పాటుతో అంబేద్కర్ ఆశీస్సులు సీఎం జగన్ కు మెండుగా ఉంటాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైకాపా యూత్ లీడర్ కొట్టు విశాల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తెన్నేటి జగ్జీవన్, చీకటిమిల్లి మంగరాజు, రామన్నగూడెం సర్పంచ్ చింతా వెంకటరావు, జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.