ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జరిగిన రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో 85 మందిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు. పోలింగ్ హింసాత్మక ఘటనలపై సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు పంపిన క్రమంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామని తెలిపారు.
ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1522 మంది నిందితులను గుర్తించినట్లు డీజీపీ పేర్కొన్నారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని, ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించారు. నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరికి 41ఏ నోటీసులిచ్చామని డీజీపీ ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఏపీలో ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి. నివేదిక పరిశీలన అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలను తీసుకోనున్నారు.