బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు..!

తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తున్న క్రమంలో బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఒకమారు నటి హేమకు నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరినా, హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో మళ్ళీ మరోతేదీ కేటాయించి హేమను విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు.

 

బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ తీసుకున్న వారికి నోటీసులు బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీపరిశ్రమకు చెందిన నటీనటులు, సీరియల్స్ లో నటించే బుల్లితెర నటులు పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించారని తేలటంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 86మంది డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టు లలో తేలింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారందరికీ నోటీసులు ఇచ్చారు.

 

నటి హేమకు రెండోసారి నోటీసులు ఇక టాలీవుడ్ సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావటంతో నటి హేమకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 27న సీసీబీ పోలీసుల ముందు హాజరుకావాలని, నోటీసులలో పేర్కొన్నారు. అయితే నటి హేమ విచారణకు హాజరు కాకుండా తాను వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నానని, తనకు కాస్త సమయం కావాలని పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మరోసారి హేమకు నోటీసులు నేడు జారీ చేశారు. ఈ నోటీసులలో హేమ జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు.

 

రేవ్ పార్టీ విషయంలో కంపు చేసుకున్న హేమ అయితే బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ లో హేమ అనవసరంగా రచ్చ చేసుకున్నారు. రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ, తాను ఏ పార్టీలకు వెళ్లలేదని హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో తాను చిల్ అవుతున్నానని ఒక వీడియో రిలీజ్ చేయటంతో హేమ వ్యవహారం వివాదం అయ్యింది. పోలీసులు హేమ రేవ్ పార్టీలో ఉన్నారని ప్రకటించటం, ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నారని నిర్ధారించటంతో టాలీవుడ్ లో హేమపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

 

హేమ నోటీసుల విషయంలో ఏం చేస్తుందో అసలు బెంగళూరు రేవ్ పార్టీతో తనకి సంబంధం లేదని బుకాయించిన హేమ మొదటిసారి పోలీసులు ఇచ్చిన నోటీసులకు వైరల్ ఫీవర్ సాకు చెప్పి డుమ్మా కొట్టారు. ఇప్పుడు మళ్ళీ జూన్ 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.